Meher Ramesh: మొన్ననే కూతురి పెళ్లి.. ఇప్పుడు తీవ్ర విషాదంలో డైరెక్టర్ మెహర్ రమేష్ ఫ్యామిలీ!

Meher Ramesh

Meher Ramesh

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట్లో ఊహించని తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితమే తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించి ఆ ఆనందంలో ఉన్న ఆయన కుటుంబాన్ని ఒక తీవ్ర శోకం ముంచెత్తింది. మెహర్ రమేష్ చిన్నక్క సుంకర మెహర్ జ్యోతి అకాల మరణం చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గత 14 రోజులుగా తీవ్రమైన వైరల్ న్యుమోనియా (ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్) సమస్యతో బాధపడుతున్న జ్యోతికి ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో జూలై 21 రాత్రి 9:45 గంటలకు విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రిలో ఆమె కన్నుమూశారు. సొంత అక్కను కోల్పోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన మెహర్ రమేష్ సోషల్ మీడియా వేదికగా అత్యంత భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు.

“నా ప్రియమైన చిన్నక్క మెహెర్ జ్యోతి సుంకర.. నా చిన్నప్పటి నుంచి నాకు అండగా నిలిచిన తను ఈరోజు మనల్ని విడిచి వెళ్లిపోయింది. నా కూతురి పెళ్లిని దగ్గరుండి జరిపించి, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఎంతో ఆనందంగా గడిపిన మా అక్క, ఇంత తొందరగా ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోవడం మా కుటుంబానికి తీరని లోటు.” అంటూ మెహర్ రమేష్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈ జూలై 1న మెహర్ రమేష్ కుమార్తె వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లతో పాటు టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఆ వేడుకల్లో మెహర్ జ్యోతి ఎంతో ఉత్సాహంగా పాల్గొని కుటుంబ సభ్యులందరితో ఆనందంగా గడిపారు. ఆ శుభకార్య జ్ఞాపకాలు ఇంకా మనసుల్లో మెదులుతుండగానే, ఇంతలోనే ఆమె అనారోగ్యం బారినపడి కన్నుమూయడం కుటుంబ సభ్యులను, బంధువులను కోలుకోలేని దెబ్బతీసింది.


విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మెహర్ జ్యోతి పార్థివదేహానికి నివాళులర్పించారు. మెహర్ రమేష్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మెగా కాంపౌండ్‌తో ఎంతో అనుబంధం ఉన్న మెహర్ రమేష్ కుటుంబానికి వచ్చిన ఈ కష్ట సమయంలో టాలీవుడ్ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు సోషల్ మీడియా ద్వారా తీవ్ర సంతాపం తెలియజేశారు. ఈ బాధ నుంచి కోలుకునే ధైర్యాన్ని మెహర్ రమేష్ కుటుంబానికి ప్రసాదించాలని సినీ ప్రముఖులు ఆకాంక్షించారు.