Dhanush: “నాకు యాక్టింగ్ నేర్పిస్తావా?”.. ఇరుముడి పాపతో ధనుష్ వీడియో కాల్ వైరల్

Irumudi Daughter

Irumudi Daughter

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘ఇరుముడి’ సినిమా ఇప్పుడు సినీ ప్రముఖుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. ఈ చిత్రంలో రవితేజ కూతురిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర.. తన ఎమోషనల్ యాక్టింగ్‌తో అందరి కంటతడి పెట్టిస్తోంది. తాజాగా ఈ చిన్నారి నటనకు కోలీవుడ్ స్టార్ హీరో, జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ సైతం ఫిదా అయిపోయారు. ఇటీవలే ‘ఇరుముడి’ సినిమా చూసిన ధనుష్.. నక్షత్ర నటనకు ముగ్ధుడై ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ ద్వారా నక్షత్రతో ధనుష్ స్వయంగా వీడియో కాల్‌లో మాట్లాడారు. సినిమాలో ఆమె పలికించిన భావోద్వేగాలను ఆయన ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఈ వీడియో కాల్‌లో ధనుష్ అడిగిన ఒక మాట ఆ చిన్నారిని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. “నీ నటన అద్భుతం.. నాకు కూడా యాక్టింగ్ నేర్పిస్తావా?” అంటూ ధనుష్ ఎంతో ఆప్యాయంగా అడగడంతో నక్షత్ర ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. అంతటి స్టార్ హీరో తనను అలా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక ఆశ్చర్యపోయింది.

నక్షత్రతో ముచ్చటించిన అనంతరం.. వీలైనంత త్వరలో తాను నేరుగా వచ్చి కలుస్తానని ధనుష్ మాట ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇండియాలోనే బెస్ట్ యాక్టర్స్‌లో ఒకరైన ధనుష్ నుంచి ఇలాంటి కాంప్లిమెంట్ రావడం ఆ చిన్నారి కెరీర్‌కు దక్కిన అతిపెద్ద బహుమతి అని సినీ అభిమానులు అంటున్నారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కళ్లతోనే హావభావాలు పలికిస్తూ, ఎమోషనల్ సీన్స్‌ను పండించిన నక్షత్ర నటన.. సినిమాకే హైలైట్‌గా నిలిచింది.’మణమ్మ’గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టేసుకున్న ఈ చిన్నారికి ఇండస్ట్రీ వర్గాల నుంచి సైతం భారీగా ప్రశంసలు దక్కుతున్నాయి.