Devaraaya: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. సుదీప్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవరాయ’ నుంచి కీలకమైన అప్‌డేట్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో సుదీప్ శ్రీకృష్ణదేవరాయలుగా కనిపించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘చరిత్రను మార్చిన సామ్రాజ్యం.. ఒక శకాన్ని నిర్వచించిన మహారాజు.. కాలాన్ని దాటి నిలిచిపోయే ఓ దిగ్గజం’ అంటూ ‘దేవరాయ’ను మేకర్స్ పరిచయం చేశారు. అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్‌ను శ్రీకృష్ణదేవరాయల పాత్రలో చూపించబోతున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు భారత చరిత్రలో అత్యంత గొప్ప రాజుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అలాంటి చారిత్రక పాత్రలో సుదీప్ కనిపించనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. విడుదల చేసిన గ్లింప్స్‌లో సుదీప్ లుక్ రాజసం, గంభీరతతో ఆకట్టుకునేలా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సుప్రియాన్వి పిక్చర్ స్టూడియో బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 డిసెంబర్‌లో థియేటర్లలోకి రానుందని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటి వరకు సుదీప్ మాస్, యాక్షన్ పాత్రలతో ప్రేక్షకులను అలరించగా.. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల వంటి చారిత్రక పాత్రలో ఆయన ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సుదీప్ కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

