సాధారణంగా నిత్యం రాజకీయాలతో, పరిపాలనతో బిజీగా ఉండే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక సినిమాను ప్రత్యేకంగా చూడటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకుని, విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది ‘ఫూలే’ చిత్రం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించి ప్రశంసల వర్షం కురిపించడంతో ఇప్పుడు సామాన్య ప్రేక్షకుల్లోనూ ఈ మూవీపై విపరీతమైన ఆసక్తి నెలకొంది.
భారత సామాజిక సంస్కరణల చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలేల జీవిత పోరాటం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రత్యేక ప్రదర్శన అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కులవివక్ష నిర్మూలనకు, మహిళా విద్యకు ఫూలే దంపతులు చేసిన అలుపెరగని పోరాటం నేటి తరానికి గొప్ప స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వారి సామాజిక సేవ, ఆదర్శప్రాయమైన జీవితాలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమైన సందేశాన్ని అందిస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పెద్దల నుంచే ఈ స్థాయిలో స్పందన రావడంతో సినిమా కంటెంట్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సమాజంలోని అసమానతలు, కులవివక్ష, మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తి.. విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తమ జీవితాలనే అంకితం చేసిన ఫూలే దంపతుల ప్రయాణాన్ని ప్రముఖ దర్శకుడు అనంత్ మహదేవన్ అత్యంత హృద్యంగా వెండితెరపై ఆవిష్కరించారు. తెలుగు డబ్బింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సుపదా క్రియేషన్స్ బ్యానర్‌పై డా. పొన్నం రవిచంద్ర నిర్మాతగా నవంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

