మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 152వ చిత్రం “ఆచార్య” షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఒక హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమా సహజ వనరులను పరిరక్షించడానికి ఒక వ్యక్తి చేస్తున్న పోరాటం చుట్టూ తిరుగుతుంది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించారు. “ఆచార్య” ప్రస్తుతం పూర్తయ్యే దశలో ఉంది. ఆ తరువాత మలయాళ హిట్ చిత్రం “లూసిఫర్” రీమేక్ సిద్ధమవుతున్నారు. చిరంజీవి ’153వ చిత్రంగా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు.
Read Also : సీనియర్ హీరోలకు ప్రమాద ఘంటికలు!
చిరంజీవి తన 154వ చిత్రం కోసం దర్శకుడు కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీతో కలిసి పని చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చిరు మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారని అంటున్నారు. చిరంజీవి తండ్రి-కొడుకులుగా నటించనున్నట్లు తెలుస్తోంది. రీఎంట్రీ మూవీ “ఖైదీ నెం.150” తరువాత ఆయన ద్వంద్వ పాత్రను పోషించడం రెండవసారి అవుతుంది. రజనీకాంత్ నటించిన యాక్షన్ డ్రామా “పేటా”తో సౌత్ అరంగేట్రం చేసిన బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఇందులో విలన్ పాత్ర పోషించే అవకాశం ఉంది. దీనిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.