సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతోందని హడావిడిగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయించుకోవాలనుకునే నిర్మాతలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) భారీ షాక్ ఇచ్చింది. ఇకపై రిలీజ్ తేదీల సాకుతో తమపై ఒత్తిడి తెస్తే కుదరదని, సెన్సార్ ప్రక్రియను వేగవంతం చేసే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు సెన్సార్ బోర్డు సీఈఓ రాజేంద్ర సింగ్ కఠిన మార్గదర్శకాలతో కూడిన ఒక అడ్వైజరీని విడుదల చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సెన్సార్ బోర్డు తీసుకున్న ఈ తాజా నిర్ణయం సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సినిమా లేదా ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించామని, త్వరగా సెన్సార్ పూర్తి చేయాలని కోరడానికి వీల్లేదని బోర్డు తేల్చి చెప్పింది. నిర్మాత ప్రకటించిన రిలీజ్ తేదీతో సంబంధం లేకుండా, చట్టబద్ధమైన గడువులు, నిబంధనల ప్రకారమే కమిటీ తగిన సమయం తీసుకుని రివ్యూ చేస్తుందని స్పష్టం చేసింది. సినిమా ఫైనల్ గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, క్రెడిట్స్, సౌండ్ మిక్సింగ్, సబ్ టైటిల్స్ అన్నీ పూర్తిగా రెడీ అయిన తర్వాతే సెన్సార్ కు దరఖాస్తు చేసుకోవాలి. అసంపూర్తిగా ఉన్న ప్రింట్లు (వర్క్-ఇన్-ప్రోగ్రెస్ కాపీలు) ఇస్తే అప్లికేషన్ ను ఏమాత్రం ఆలోచించకుండా తిరస్కరిస్తామని హెచ్చరించారు’.
కేవలం సెన్సార్ అప్లికేషన్ లో పేరు పెట్టినంత మాత్రాన సినిమా టైటిల్ కు ఆమోదం లభించినట్లు కాదని బోర్డు పేర్కొంది. నిబంధనల ప్రకారం టైటిల్ ను మార్చే అధికారం ఎగ్జామినింగ్ కమిటీకి ఉంటుంది కాబట్టి, సర్టిఫికేట్ రాకముందే అదే ఫైనల్ టైటిల్ అని నిర్మాతలు ప్రచారం చేయకూడదని సూచించింది. సినిమాటోగ్రాఫ్ చట్టం 1952 మరియు 2024 రూల్స్ కు లోబడి, తమ సినిమా విడుదల తేదీని దృష్టిలో ఉంచుకుని ప్రొడ్యూసర్లు ముందుగానే సెన్సార్ కు అప్లై చేసుకోవాలని బోర్డు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. చివరి నిమిషంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేస్తూ, ఆగమేఘాల మీద సెన్సార్ చేయించుకునే సినీ నిర్మాతలకు ఈ కొత్త నిబంధనలు పెద్ద బ్రేక్ వేసినట్లే అని చెప్పవచ్చు.

