చూసేవాడికి కామెడీ సినిమా, సీరియస్ సినిమా, యాక్షన్ మూవీ, థ్రిల్లర్ మూవీ… ఇలా చాలా రకాలుంటాయి. కానీ, సినిమా తీసేవాడికి మాత్రం, ప్రతీ చిత్రం, థ్రిల్లరే! ఎందుకంటే, సినిమా అనేది కోట్ల రూపాయల వ్యాపారం. ఎక్కడ తేడా వచ్చినా కోట్లు కోట్టుకుపోతాయి. ఒక్కోసారి ఒకే ఒక్క సినిమా వల్ల లాస్ తో కొట్టు మొత్తం మూసేసి వెళ్లిపోతుంటారు నిర్మాతలు! తాను అటువంటి రకం కాదంటున్నాడు బోనీ కపూర్…
బాలీవుడ్ సీనియర్ నిర్మాతగా బోనీ కపూర్ కు సినిమా కష్టాలు కొత్తేం కాదు. కానీ, ఈ సారి రెండు లాక్ డౌన్స్, మధ్యలో ముంబైపై విరుచుకుపడ్డ తుఫాన్లు లెక్క మొత్తం తప్పించాయి. దాంతో బోనీ కపూర్ నిర్మిస్తోన్న ‘మైదాన్’ మూవీ తలకు మించిన భారంగా తయారైంది. ఇప్పటికే 80 శాతం చిత్రం పూర్తైనప్పటికీ విడుదల చేయటానికి వీలులేని స్థితిలో ఉంది. అంతే కాదు, ‘మైదాన్’ స్పోర్ట్స్ డ్రామా కావటంతో ముంబైలో 16 ఏకరాల స్థలంలో ప్రత్యేక సెట్స్ వేశారు. మొదటిసారి వాటి కోసం 16 కోట్లు ఖర్చు చేశారట. లాక్ డౌన్ వచ్చిపడటంతో సెట్స్ అన్నీ తొలగించారు. మళ్లీ రెండోసారి కొత్తగా వేసినప్పుడు పాత మెటీరియల్ వాడటం వల్ల 7 కోట్లు ఖర్చయ్యాయి. కానీ, లాక్ డౌన్, అంతలోనే తుఫాన్ రావటంతో ఈసారి సెట్స్ మొత్తం పనికి రాకుండా అయ్యాయి. ఇక ఇప్పుడు మూడోసారి ‘మైదాన్’ మూవీ సెట్స్ నిర్మించాలట. ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో ఇంకా క్లారిటీ లేదు!
సినిమా డిలే అవ్వటం అంటే కేవలం సెట్స్ కోసం చేసే ఖర్చు మాత్రమే కాదు. రకరకాల చోట్లలో ఉన్న పలువురు నటులు, టెక్నీషియన్స్ ని విమానాల్లో రప్పించాలి. రెండుసార్లు వాయిదా పడటంతో ఫ్లైట్ ఛార్జీలు కూడా తడిసి మోపెడవుతున్నాయట. ఇవే కాక షూటింగ్ కోసం ఎంచుకున్న 16 ఏకరాల ప్రాంతాన్ని కూడా నిర్మాతగా బోనీ కపూరే కాపాడుకోవాలి. అందుకు కోసం సెక్యులరి ఏర్పాటుకు మరింత ఖర్చు!
‘మైదాన్’ చిత్రం పలు మార్లు వాయిదా పడటం తనకు ఎంతో నష్టాన్ని, మానసిక ఒత్తిడిని కలిగించిందని బోనీ కపూర్ చెబుతున్నాడు. కాకపోతే, తాను జీవితంలో ఇంతకంటే తీవ్రమైన సంక్షోభాలు చూశానని చెబుతోన్న ఆయన తప్పకుండా గండం నుంచీ బయటపడతానని నమ్మకంగా అంటున్నాడు. అజయ్ దేవగణ్ హీరోగా రూపొందుతోన్న ‘మైదాన్’ త్వరగా పూర్తికావాలని, మంచి హిట్టై నిర్మాత పడ్డ కష్టానికి, ఎదుర్కొన్న నష్టానికి మంచిన లాభాలు, సంతోషాలు రావాలని మనమూ కోరుకుందాం!