దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు తమ ప్రదర్శనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడగట్టుకుంటారు. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు తమ ప్రతిభను ప్రదర్శించడానికి బిగ్ బాస్ ను మంచి వేదికగా భావిస్తారు. షో నుంచి బయటకు వచ్చిన తరువాత కంటెస్టెంట్లు తమ ఫేమ్ కు తగ్గట్లుగా ఇండస్ట్రీలో అవకాశాలు పొందుతారు. గత సీజన్ బిగ్ బాస్-4లో పాల్గొన్న అఖిల్, సోహైల్, అవినాష్, దివి తదితరులు షో తరువాత పలు టీవీ షోలు, సీరియళ్లు, సినిమాలతో, వెబ్ సిరీస్ లతో బిజీగా మారారు. అయితే బిగ్ బాస్-4 విజేతగా నిలిచి భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న యంగ్ హీరో అభిజిత్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. బిగ్ బాస్ పూర్తయ్యి చాలా నెలలు గడుస్తున్నా ఒక్కటి అంటే ఒక్క సినిమాలో కూడా అభిజిత్ నటించలేదు. పైగా చిత్ర నిర్మాతలు అభిజీత్ ను సినిమాల్లో రెండవ హీరోగా, లేదంటే సపోర్టింగ్ రోల్ లో నటించమని అడుగుతున్నారట. దీంతో అభిజీత్ నిరాశలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మెయిన్ హీరోగా మాత్రమే నటించాలని భావిస్తున్న అభిజీత్ కు టాలీవుడ్ నుంచి పెద్ద ఆఫర్ ఎప్పుడు వస్తుందో చూడాలి.