ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ నూతన సభ్యుల ప్రమాణస్వీకారం విజయవాడలో జరిగింది. హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. ఇక ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం టాలీవుడ్‌లో నెలకొన్న థియేటర్ల సంక్షోభం, ఎగ్జిబిటర్ల సమస్యలపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. “ప్రస్తుతం సినిమాను మనం బతికించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎగ్జిబిటర్లను చూస్తుంటే చాలా జాలేస్తోంది. థియేటర్లకు తాళాలు వేసే దుస్థితి రావడం నిజంగా బాధాకరం. కొన్ని చోట్ల పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్లే థియేటర్లు మూతపడుతున్నాయి. కానీ ఇకపై అలా జరగకూడదు. ఎగ్జిబిషన్ సెక్టార్ మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకుని, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి” అని బాలకృష్ణ అన్నారు.
పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే మరిన్ని ఎక్కువ సినిమాలు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. “ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే ఎక్కువ సంఖ్యలో మంచి సినిమాలు రావాలి. అయితే, ఈ రోజుల్లో ఇండస్ట్రీలో టెక్నాలజీ చాలా పెరిగింది. దీనివల్ల లాభాలు ఉన్నప్పటికీ.. క్వాలిటీ కోసం మేకింగ్ సమయం ఎక్కువై, సినిమాలు విడుదల కావడం చాలా ఆలస్యమవుతోంది. ఈ గ్యాప్‌ను తగ్గించి ఎక్కువ కంటెంట్ ప్రేక్షకులకు అందించాలి” అని సూచించారు. సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం కూడా చిత్ర పరిశ్రమకు, ఎగ్జిబిటర్లకు పూర్తి అండగా నిలవాలని, ఇండస్ట్రీని ఆదుకునేలా సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఈ వేదిక ద్వారా బాలకృష్ణ కోరారు.
