Site icon NTV Telugu

Allu Arjun-Kollywood: కోలీవుడ్ టాప్ డైరెక్టర్‌లతో అల్లు అర్జున్ సినిమాలు.. అందుకోసమేనా?

Allu Arjun Kollywood

Allu Arjun Kollywood

తెలుగు ఇండస్ట్రీలో ఐకాన్, పాన్ ఇండియా స్టార్.. ఇప్పుడు కోలీవుడ్ గేమ్ ఛేంజర్‌గా మారుతున్నారా?. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న అల్లు అర్జున్.. ఇప్పుడు సడెన్‌గా మరో కోలీవుడ్ టాప్ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవ్స్ వెనక రీజన్ ఏంటి?, కోలీవుడ్ సూపర్ స్టార్ హోదా కోసమేనా?.

ఒకప్పుడు కోలీవుడ్‌ని ఏలిన స్టార్స్ ఇప్పుడు ఒక్కొక్కరిగా లైన్ నుంచి తప్పుకుంటున్నారు. దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ ‘జననాయగన్’ తన చివరి సినిమా అని అనౌన్స్ చేశారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ వయసు పెరిగి, సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. అజిత్ కుమార్‌కు ఫ్యాన్ బేస్ ఉన్నా.. పాన్ ఇండియా కమర్షియల్ స్ట్రాటజీ లేదు. ఇకపోతే సూర్య స్టార్ డమ్‌కు దగ్గరే ఉన్నా కానీ.. సూపర్ స్టార్ స్థాయి ఇంకా రాలేదు. ఈ గ్యాప్‌లో ఒక అదర్ స్టేట్ హీరో సైలెంట్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. దీనికి ‘పుష్ఫ 2’ తమిళనాడులో సృష్టించిన సునామీ ఒక బలమైన కారణం.

డబ్బింగ్ సినిమా అంటే కోలీవుడ్‌లో ఓ లిమిట్ ఉంటుంది. కానీ పుష్ప 2 ఆ లిమిట్‌ను పూర్తిగా బ్రేక్ చేసింది. తమిళనాడు కలెక్షన్స్ గ్రాస్ మొదటి రోజు రూ.8 కోట్లు, మొదటి వారం రూ.41.50 కోట్లు, 12వ రోజు 65.75 కోట్లు. మొత్తం రూ.75 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది డబ్బింగ్ సినిమాగా చరిత్రాత్మక రన్. నాన్ ఎస్ఎస్ రాజమౌళి సినిమాల్లో తమిళనాడులో రూ.50 కోట్లు దాటిన మొదటి చిత్రం పుష్ప 2. అంతే కాదు 800కి పైగా స్క్రీన్‌లలో విడుదల.. డబ్బింగ్ సినిమాకు ఇదే హయ్యెస్ట్ థియేట్రికల్ రిలీజ్ రికార్డు. బాహుబలి 2 తమిళ వెర్షన్ రికార్డును కూడా క్రాస్ చేసింది. ఇది అల్లు అర్జున్‌కు తమిళనాడులో స్ట్రాంగ్ మార్కెట్ ఉందని నిరూపించింది.

Also Read: Daryl Mitchell History: డారిల్ మిచెల్ చరిత్ర.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!

ఇప్పటికే అలా వైకుంఠ పురంలో, పుష్ప సినిమాలతో తమిళ ఆడియన్స్‌లో బన్నీకి సాలిడ్ క్రేజ్ ఏర్పడింది. పుష్ప ది రూల్ మూవీతో అది మరింత పెరిగింది. అందుకే షారూక్ ఖాన్‌తో పాన్ ఇండియా హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ జానర్‌లో ఈ మూవీని AA22, A6 వర్కింగ్ టైటిల్‌తో ఓ రేంజ్‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే కత్తి, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ లాంటి భారీ యాక్షన్ సినిమాలతో టాప్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న లోకేష్ కనగారాజ్‌తో వెంటనే మరో ప్రాజెక్ట్ సైన్ చేశారు అల్లు అర్జున్. అట్లీతో సినిమా కంప్లీట్ అయిన వెంటనే లోకేష్‌తో సినిమా షూటింగ్లో బిజీగా ఉండనున్నారు బన్నీ. ఇవన్నీ చూస్తుంటే… కోలీవుడ్‌లో నెక్స్ట్ సూపర్ స్టార్ బన్నీ అవుతాడా? లేక కోలీవుడ్‌కే కొత్త డెఫినిషన్ ఇస్తాడా? అనే చర్చ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

Exit mobile version