Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’

Hpv News

Hpv News

సాధారణంగా హీరోల అభిమాన సంఘాలు అంటే కటౌట్లు కట్టడం, థియేటర్ల వద్ద హంగామా చేయడం, రికార్డుల కోసం సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం వరకే పరిమితం అవుతాయనే ఒక అపవాదు ఉంది. కానీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) మాత్రం ఆ గీతను చెరిపేస్తూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక ప్రాణాంతక వ్యాధి బారిన పడకుండా ఏకంగా 3 లక్షల మంది బాలికలకు రక్షణ కవచంగా నిలిచే ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రియల్ హీరోలమనిపించుకున్నారు బన్నీ ఫ్యాన్స్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వస్థ్ నారీ వికసిత్ భారత్’ కార్యక్రమంలో అల్లు అర్జున్ అభిమానులు భాగస్వాములయ్యారు. మహిళల పాలిట సైలెంట్ కిల్లర్‌గా మారుతున్న సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) నివారణ, హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్ ఆవశ్యకతపై భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా, అలాగే అండమాన్ నికోబార్ దీవుల వరకు మొత్తం 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ అవగాహన ప్రచారాన్ని హోరెత్తించారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా నేరుగా గ్రౌండ్ లెవెల్‌లోకి దిగి ఏకంగా 820 స్కూల్స్, వివిధ కమ్యూనిటీల్లో విద్యార్థినులను కలుసుకున్నారు. ఈ మెగా డ్రైవ్ ద్వారా సుమారు 3 లక్షల మంది యువతులకు, బాలికలకు చేరువయ్యారు. భవిష్యత్తులో క్యాన్సర్ మహమ్మారి బారిన పడకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎంత కీలకమో వివరిస్తూ సమాజం పట్ల తమకున్న బాధ్యతను చాటుకున్నారు. తమ అభిమాన హీరో సినిమా వస్తోందంటేనే పండగ చేసుకునే ఫ్యాన్స్.. ఇప్పుడు ఏకంగా ఒక సామాజిక లక్ష్యం కోసం దేశవ్యాప్తంగా ఏకతాటిపైకి రావడం సర్వత్రా ప్రశంసలందుకుంటోంది. సమాజం బాగు కోసం ముందడుగు వేస్తూ, బాలికలకు అండగా నిలబడిన ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ చేస్తున్న ఈ కృషి ఇప్పుడు ఇతర అభిమాన సంఘాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది.