Basil Joseph: యాక్టింగ్‌ను పక్కనపెట్టి దర్శకుడిగా మారిన హీరో.. బన్నీ కోసమేనా!

Allu Arjun Basil Joseph

Allu Arjun Basil Joseph

Basil Joseph: మలయాళ ఇండస్ట్రీలో వారానికో సినిమాతో అలరిస్తూ.. హీరోయిన్ కీర్తి సురేష్ చేత ముద్దుగా ‘వీక్లీ స్టార్’ అని పిలిపించుకున్న టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్. ఏడాదికి నాలుగైదు చిత్రాలతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసే ఈ హీరో.. గత కొంతకాలంగా వెండితెరపై తనదైన దూకుడు తగ్గించేశారు. సోలో హీరోగా సినిమా వచ్చి ఏడాదిన్నర దాటిపోతున్నా కొత్త ప్రాజెక్ట్‌లను ఒప్పుకోవడం లేదు. ఆఫర్లు లేకనా లేక కావాలనే నటనకు బ్రేక్ ఇచ్చారా అంటే.. తెరవెనుక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో జతకట్టే భారీ పాన్ ఇండియా ప్లాన్ నడుస్తోందనే సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ‘మిన్నల్ మురళి’, ‘గోధా’ వంటి అద్భుతమైన చిత్రాలతో డైరెక్టర్‌గా తన ప్రతిభను దేశవ్యాప్తంగా చాటుకున్న బాసిల్ జోసెఫ్.. ప్రస్తుతం పూర్తిస్థాయిలో మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఇతర ఆఫర్లతో పాటు ‘ధర్మన్’ ప్రాజెక్ట్‌ను కూడా వదులుకున్నట్లు తెలుస్తోంది. డబ్బింగ్ సినిమాలతో మలయాళంలో సైతం భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న అల్లు అర్జున్‌కు బాసిల్ ఇటీవల ఒక అదిరిపోయే కథను వినిపించి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్‌ను పక్కాగా సిద్ధం చేయడం కోసమే బాసిల్ నటనకు తాత్కాలికంగా విరామం ఇచ్చారట.

మొన్నటివరకు ఈ ప్రాజెక్ట్‌పై కేవలం గుసగుసలు మాత్రమే వినిపించగా.. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అల్లు శిరీష్ వివాహ వేడుకలో బాసిల్ జోసెఫ్ ప్రత్యేకంగా హాజరై సందడి చేయడంతో ఈ కాంబినేషన్‌పై మరింత స్పష్టత వచ్చింది. బన్నీ కుటుంబంతో ఆయనకున్న సాన్నిహిత్యం, జరుగుతున్న చర్చలు చూస్తుంటే ఈ క్రేజీ మూవీ పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ – బాసిల్ జోసెఫ్ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. గతంలో ‘మరణమాస్’ చిత్రంతో మెప్పించిన బాసిల్.. ఆ తర్వాత సోలో హీరోగా మళ్లీ కనిపించలేదు. ఈ మధ్య కాలంలో ‘పరాశక్తి’ చిత్రంలో స్పెషల్ అపీరియన్స్, మల్టీస్టారర్ మూవీ ‘అతిరథి’లో ఒక హీరోగా మాత్రమే మెరిశారు. నిర్మాతగా ‘అతిరథి’ మంచి లాభాలను తెచ్చిపెట్టినప్పటికీ, నటుడిగా మాత్రం ఆశించినంత జోరు చూపించలేదు. ప్రస్తుతం కమిట్ అయిన తమిళ చిత్రం ‘రావడి’, ‘మంజేశ్వరం మాఫియా’ మినహా మరే కొత్త చిత్రాన్నీ ఆయన అంగీకరించకపోవడం వెనుక.. బన్నీ సినిమాపైనే ఆయన పూర్తి ఫోకస్ పెట్టారనే వాదనకు మరింత బలం చేకూరుతోంది.