గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీనుల శక్తివంతమైన కలయికలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే భారీ అంచనాలను పెంచాయి. ఈ సందర్భంగా, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.
గ్రాండ్‌గా యాక్షన్!
‘అఖండ’కు మించిన అంచనాలు ‘అఖండ 2’పై ఉన్నాయని, ఇందులో డైరెక్టర్ బోయపాటి గారు బాలయ్య గారి విశ్వరూపం చూపించారని రామ్-లక్ష్మణ్ తెలిపారు. భగవంతుడి శక్తిని తీసుకున్న హీరో పాత్రని ఢీకొనేందుకు, విలన్ పాత్ర కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. అందుకే ఆది పినిశెట్టికి చాలా కొత్త గెటప్ ఇచ్చారని, అతని దగ్గర నెగిటివ్ ఎనర్జీ, అఖండ పాత్రలో పాజిటివ్ ఎనర్జీ ఉంటాయని… ఈ రెండు శక్తుల మధ్య యాక్షన్ చాలా కొత్తగా కంపోజ్ చేయబడిందని వివరించారు.
పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం:
అఖండకు మించిన స్పాన్, కాన్వాస్ ఈ సినిమాలో ఉన్నాయి. దీనిని పాన్ ఇండియా లెవెల్‌లో తీయాలనే ఉద్దేశంతో దర్శకుడు ప్రతిదీ చాలా గ్రాండ్‌గా తీర్చిదిద్దారని, అందరం ఛాలెంజింగ్‌గా తీసుకుని గొప్ప సినిమాను అందించడానికి 100% ఎఫర్ట్ పెట్టామని తెలిపారు.
త్రిశూలం-గన్ కాంబినేషన్: టీజర్, ట్రైలర్‌లో చూసినట్టుగా, గన్ పవర్‌కు త్రిశూలం శక్తి, శివుని శక్తి తోడైతే ఎలా ఉంటుందో, ఆ పవర్‌తో యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేయడం జరిగిందని చెప్పారు.
వెయ్యి శాతం అంచనాలు: ప్రేక్షకులు 100% అంచనాలు పెట్టుకుంటే, ఈ సినిమా వెయ్యి శాతం ఆ అంచనాలను అందుకునేలా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
బాలయ్య అద్భుతం – దైవ శక్తి!
బాలకృష్ణ గారు తమపై చూపించే నమ్మకాన్ని గుర్తు చేసుకుంటూ, ‘సింహ’, ‘లెజెండ్’ లాంటి మాస్ పాత్రలకు ఫైట్స్ డిజైన్ చేశామని, ‘అఖండ 2’లో మాస్ క్యారెక్టర్‌కు డివైన్ ఎనర్జీ తోడైతే వచ్చే శక్తిని తీసుకుని ఫైట్స్ కంపోజ్ చేశామని తెలిపారు. “సినిమాలో యాక్షన్ చూస్తున్నప్పుడు గూస్‌బంప్స్ వస్తాయి. బాలయ్య గారు ఒక అద్భుతం. మంచులో కూడా స్లీవ్ లెస్ ధరించి, పాత్ర కోసం ప్రాణాలు పెట్టే విధంగా అద్భుతమైన యాక్షన్ చేశారు. బాలకృష్ణ గారిని ఎదురుగా చూస్తున్నప్పుడు ఒక దైవ శక్తిని చూస్తున్నట్టుగా ఉండేది,” అని రామ్-లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పాత్రను బాలకృష్ణ గారు తప్ప ఇంకెవరూ చేయలేరని, అభిమానులను అలరించాలనే తపనతో ప్రతి షాట్‌ను, 99% యాక్షన్ సీక్వెన్స్‌లను ఆయనే చేశారని తెలిపారు.
శివతత్వం నింపుకునే సినిమా
ఈ సినిమా ఓంకారం శక్తి, శివశక్తిని గుండెల్లో నింపుకుంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ సినిమా కోసం టన్నుల కొద్దీ విభూతి వాడడం జరిగింది. సినిమా చూసి బయటికి వస్తున్నప్పుడు మన మీద విభూది వర్షం కురిసినట్టుగా అనిపిస్తుందని, ఆడియన్స్ మంచి వైబ్రేషన్‌తో ఉంటారని, శివ తత్వాన్ని కడుపు నిండా నింపుకునే సినిమా ఇదని వారు వివరించారు. కుంభమేళాలో కూడా ఈ సినిమాకు సంబంధించిన సీన్స్ చిత్రీకరించడం ఒక అద్భుతమైన అనుభూతి అని తెలిపారు.
మూడు వేరియేషన్స్ – అంతకుమించిన యాక్షన్!
‘అఖండ 2’లో మూడు వేరియేషన్స్ ఉన్న ఫైట్ సీక్వెన్స్‌లు ఉన్నాయని, మూడు క్యారెక్టరైజేషన్లు కొత్తగా చేసే అవకాశం ఇచ్చాయని, ఎక్కడా బోర్ కొట్టకుండా యాక్షన్ అలరిస్తుందని చెప్పారు. ‘అఖండ’లో చక్రం తిప్పే సీన్ లాంటి హైలైట్ అంశం ఈ సినిమాలో ఉంటుందా అనే ప్రశ్నకు, “కచ్చితంగా అంతకుమించిన యాక్షన్ ఈ సినిమాలో ఉంటుంది,” అని సమాధానమిచ్చారు. ఆడియన్స్ కనెక్ట్ అయిన ఎలిమెంట్స్‌కు మించి యాక్షన్ కంపోజ్ చేసినట్టు తెలిపారు. ఫైట్ మాస్టర్‌గా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండాలని, కాంపిటీషన్ ఉన్నప్పుడే క్రియేటివిటీ వస్తుందని చెబుతూ, త్వరలోనే తమ అబ్బాయి రాహుల్ కూడా యాక్షన్ డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నట్టుగా ఈ సందర్భంగా ప్రకటించారు. ‘అఖండ 2: తాండవం’ తెలుగు సినీ చరిత్రలో మరొక మైలురాయిగా నిలవబోతుందని, ఇది ప్రపంచ దేశాలు కూడా శివుడి శక్తిని చూసి గర్వపడేలా ఉంటుందని రామ్-లక్ష్మణ్ ముగించారు.