Adarsha Kutumbam OTT Release: థియేటర్లలో మిస్ అయినా, మరోసారి వెంకీ మామ స్వాగ్‌ను ఎంజాయ్ చేయాలనుకున్నా అభిమానులకు గుడ్ న్యూస్. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నంబర్ 47’ డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయ్యింది. రేపటి నుంచే (నవంబర్ 27) ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం సందడి చేయనుంది. “హౌస్ నంబర్ 47 లోకి ఒక కొత్త కుటుంబం అడుగుపెడుతోంది.. ఓ లుక్కేద్దామా?” అంటూ నెట్‌ఫ్లిక్స్ తాజాగా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితం కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ అభిమానులను కూడా ఆకట్టుకునేలా త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడంతో, ఓటీటీలో దీనికి భారీ రెస్పాన్స్ రావడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో మెరిశారు.
కథ
ఒక హాస్పిటల్లో ఉద్యోగం చేసే చిట్టిబాబు (వెంకటేష్), తన భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి), కొడుకు సర్వ (ప్రజ్వల్), కుమార్తె (యువినా పార్థవి) తో ఒక సాదాసీదా జీవితం గడుపుతూ ఉంటాడు. భార్య చీటీ పాట కారణంగా నాలుగు లక్షలు నష్టపోవడంతో పాటు, కొడుకు ఆపరేషన్ కోసం రెండు లక్షలు కావాలని తెలియడంతో, ఆ డబ్బులు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే, అనుకోకుండా కొన్న ఒక లాటరీ టికెట్ ద్వారా ఈ ఫ్యామిలీకి వంద కోట్లు వచ్చి పడతాయి. దీంతో అప్పటి వరకు ఒక చిన్న కాలనీలో ఉండే వాళ్లు పెద్ద గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవుతారు.
అయితే, బీహార్ డకాయిటీ గ్యాంగ్ అన్ని రాష్ట్రాలు తిరుగుతూ, తెలంగాణలోకి ఎంటర్ అయ్యాక, ఈ ఫ్యామిలీ నుంచి వీళ్లు సంపాదించిన వంద కోట్లు కొట్టేయడానికి ప్లాన్ చేస్తారు. అందులో భాగంగానే, ఆ గ్యాంగ్‌కు చెందిన నీలా(దేవియాని శర్మ), ఆమె తమ్ముడు పింటూ అదే ఇంటిలో పనికి చేరతారు. ఇక ఒక రాత్రి చూసుకుని, వారి ఇంటి నుంచి డబ్బు దొంగిలించడానికి ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో అసలు ఏం జరిగింది? వీరి ఇంటి నుంచి బీహార్ గ్యాంగ్ డబ్బు దొంగతనం చేసిందా లేదా? చివరికి ఏం జరిగింది? ఈ సినిమాలో చిత్తరంజన్(సత్య), డీఎస్పీ బృహస్పతి( రావు రమేష్), ఎస్పీ (నారా రోహిత్) పాత్రలు ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే.

