కొచ్చిలో ఒక యువ వైద్యుడిపై జరిగిన భౌతిక దాడి ఘటన కేరళ రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటన వెనుక టాలీవుడ్లో మత్తు వదలరా సినిమాలో నటించిన నటి వేసిన కిలాడీ స్కెచ్ ఉన్నట్లు పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. నటి అతుల్య చంద్ర ప్రధాన సూత్రధారిగా, నటుడు బిపిన్ పెరుంపల్లితో కలిసి ఏకంగా రూ. 6 కోట్లు దండుకునేందుకు ప్రయత్నించడం, ఆ తర్వాత బ్లాక్ మెయిల్‌కు పాల్పడటం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది. అతుల్య చంద్ర బంధువుల అమ్మాయితో సదరు డాక్టర్‌కు సన్నిహిత సంబంధాలు, స్నేహం ఉంది. ఆ పరిచయాన్నే ఆసరాగా చేసుకున్న నటి అతుల్య, నటుడు బిపిన్ పెరుంపల్లి కలిసి డాక్టర్ వద్ద నుంచి భారీగా డబ్బు గుంజాలని ప్లాన్ వేశారు. ఇద్దరి మధ్య ఉన్న ఒక వివాదాన్ని పరిష్కరిస్తామని నమ్మబలికి ఫ్లాట్ కి రప్పించుకుని అనంతరం, డాక్టర్‌ను ఏకంగా రూ. 6 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అయితే, అంత భారీ మొత్తం తన వద్ద లేదని, తానివ్వలేనని డాక్టర్ తేల్చి చెప్పడంతో ఈ ముఠా తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. డాక్టర్‌కు సంబంధించిన అత్యంత వ్యక్తిగత వీడియో ఫుటేజ్, ప్రైవేట్ వాట్సాప్ చాట్స్‌ను సోషల్ మీడియాలో లీక్ చేస్తామంటూ తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగింది. వారి బ్లాక్ మెయిల్‌కు కూడా ఆ డాక్టర్ లొంగకపోవడంతో, పక్కా ప్లాన్ ప్రకారం అతనిపై అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే, పక్కా పథకం ప్రకారం డాక్టర్‌ను ‘హనీట్రాప్’ చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే అతుల్య బంధువు వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేయనున్నారు. ఇక ఈ కేసులో పాల్గొన్న నిందితులకు పక్కా క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నటుడు బిపిన్ పెరుంపల్లి డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై గతంలోనే ఎన్డీపిఎస్ (డ్రగ్స్) కేసులతో సహా దాడులకు పాల్పడిన సుమారు 8 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో నిందితుడైన జిమ్ ట్రైనర్ వద్ద డాక్టర్‌కు సంబంధించిన మొబైల్ ఫోన్లు (వ్యక్తిగత డేటా ఉన్న ఫోన్లు) ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, ఈ సెలబ్రిటీల ముఠా వెనుక ఉన్న చీకటి కోణాలను వెలికితీసే పనిలో ఉన్నారు.

