Dharma Mahesh : హీరో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

Dharma Mahesh

Dharma Mahesh

హైదరాబాద్‌లోని సినీ ప్రముఖుల నివాస ప్రాంతమైన ఫిలింనగర్‌లో అర్ధరాత్రి వేళ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కొందరు యువకులు మితిమీరిన వేగంతో నడిపిన ఓ కారు.. టాలీవుడ్ యంగ్ హీరో, ‘డ్రింకర్ సాయి’ సినిమా ఫేమ్ ధర్మ మహేష్ నివాసంలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు కారును అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా నడిపారు. ఫిలింనగర్ రోడ్డులో వస్తూ ఒక్కసారిగా కారుపై నియంత్రణ కోల్పోవడంతో, అది నేరుగా ధర్మ మహేష్ ఇంటి వైపు దూసుకువచ్చింది. తీవ్రమైన వేగంతో వచ్చి ఢీకొట్టడంతో ఇంటి ప్రధాన గేటుతో పాటు కాంపౌండ్ వాల్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో ఇంట్లో ఉన్నవారితో పాటు చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు.

ఈ ప్రమాదం నుంచి ధర్మ మహేష్ కుటుంబ సభ్యులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఘటన జరిగిన వెంటనే సదరు యువకుల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మ కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మద్యం మత్తులో కారు నడిపిన యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హీరో ధర్మ మహేష్ కేవలం సినిమాల పరంగానే కాకుండా, గతంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాల వల్ల కూడా వార్తల్లో నిలిచారు. ఆయన భార్య గౌతమితో ఏర్పడిన మనస్పర్థలు, గొడవల కారణంగా కొన్నాళ్ల పాటు మీడియాలో, సోషల్ మీడియా వేదికల్లో ఈయన పేరు విపరీతంగా వైరల్ అయింది. ఆ వివాదాల నుంచి కోలుకుని కెరీర్‌పై దృష్టి పెడుతున్న తరుణంలో, ఇప్పుడు తాజాగా ఆయన నివాసంపై ఇలా కారుతో దాడి జరిగినంత పని కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.