(మే 16తో ‘వీరకంకణం’కు 65 ఏళ్ళు)
నటరత్న యన్టీఆర్ కథానాయకునిగా తెరకెక్కిన జానపద చిత్రం ‘వీరకంకణం’ ఆ రోజుల్లో జనాన్ని భలేగా అలరించింది. 1950లో ఎమ్.జి.రామచంద్రన్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘మంత్రి కుమారి’ ఆధారంగా ఈ ‘వీరకంకణం’ తెరకెక్కింది. ఆ సినిమాను నిర్మించిన మోడరన్ థియేటర్స్ సంస్థ ‘వీరకంకణం’ను తెలుగులోనూ నిర్మించింది. 1957 మే 16న ‘వీరకంకణం’ చిత్రం విడుదలయింది.
‘వీరకంకణం’ కథ ఏమిటంటే- ఓ దేశానికి రాజైన వెంగళరాయ దేవ అమాయకుడు. తమ రాజగురువు ఏది చెబితే అదే వేదం అని నమ్ముతూ ఉంటాడు. వెంగళరాయ దేవ కూతురు రజనికి, తన కొడుకు చంద్రసేనుని కి వివాహం జరిపించి రాజ్యం కాజేయాలన్నది రాజగురువు పథకం. మంత్రి కుమార్తె పార్వతిని చంద్రసేనుడు ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు.
చంద్రసేనుని అకృత్యాలను తొలి నుంచీ సేనాని వీరమోహన్ వ్యతిరేకిస్తూ ఉంటాడు. జనాలను ఓ జట్టుగా చేర్చి సైన్యాన్నీ తయారు చేస్తాడు వీరమోహన్. అతణ్ణి ఎలాగైనా మట్టు పెట్టాలన్నదే రాజగురువు యోచన. వీరమోహన్ మంచితనం, వీరత్వం మెచ్చిన రాజకుమారి రజని అతణ్ణి ప్రేమిస్తుంది. కానీ, తన భార్య పార్వతిని చంపేసి, తాను రాకుమారిన పెళ్ళాడాలని చంద్రసేనుడు, అతని తండ్రి రాజగురువు పథకం వేస్తారు. అదే సమయంలో రాజును హతమార్చాలని రాజగురువు ప్రయత్నిస్తాడు.
అది తెలిసి రక్షించిన వీరమోహన్ పైకే నేరం మోపుతాడు రాజగురువు. వీరమోహన్ కు ఉరిశిక్ష విధిస్తారు. అప్పుడు పార్వతి వచ్చి జనానికి తన మామ, భర్త చేసిన దాష్టీకాల గురించి చెబుతుంది. రాజగురువు ఆమెను చంపుతాడు. జనం రాజగురువును మట్టు పెడతారు. వీరమోహన్ , రజనీ పెళ్ళి జరుగుతుంది. రాజగురువు బలిగొన్న పార్వతికి సమాధి కట్టి, ఆమెను అందరూ కీర్తిస్తూ ఉండగా కథ ముగుస్తుంది.
యన్టీఆర్, కృష్ణకుమారి, జగ్గయ్య, జమున, గుమ్మడి, రమణారెడ్డి, రేలంగి, పేకేటి శివరామ్, కేవీయస్ శర్మ, గిరిజ, ఇ.వి.సరోజ, రమాదేవి తదితరులు నటించిన ఈ చిత్రానికి సుసర్ల దక్షిణామూర్తి సంగీతం సమకూర్చారు. . తమిళ మాతృక ‘మంత్రికుమారి’కి ప్రముఖ రచయిత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్. కరుణానిధి కథను సమకూర్చారు.
ఆ కథకు కొన్ని మార్పులూ చేర్పలూ చేసి ఆరుద్ర రచన చేయడంతో కథ, మాటలు, పాటలు ఆయన పేరునే ప్రకటించారు. ఈ చిత్రంలోని “కట్టండి వీర కంకణం…”, “అందాల రాణి ఎందుకో గానీ…”, “ఇక వాయించకోయి మురళీ…”, “హంస భలే రామ్ చిలక…”, “తేలి తేలి నా మనసు…” వంటి పాటలు అలరించాయి. రిపీట్ రన్స్ లో ‘వీరకంకణం’ భలేగా అలరించింది.
Vladimir Putin : పుతిన్‌కు బ్లడ్ క్యానర్స్ అంటున్న బ్రిటన్ మాజీ గూఢచారి
