మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లోని స్వప్నాలు, ఆశలు, ఆవేదనలను హృదయానికి హత్తుకునేలా సిద్ధార్థ్ ‘3 BHK’ ట్రైలర్ కట్ చేశారు.. సిద్ధార్థ్ నటిస్తున్న 40వ చిత్రంగా రూపొందిన ఈ సినిమా, శ్రీ గణేష్ దర్శకత్వంలో శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించారు. ఈ రోజు విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, ప్రేక్షకుల హృదయాలను కదిలించేలా ఒక ఎమోషనల్ జర్నీలా అనిపించింది. ఒక సామాన్య కుటుంబం సొంత ఇల్లు కొనాలనే జీవన్మరణ కల చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని ట్రైలర్ తో క్లారిటీ వచ్చింది. జీవితంలో అనేక నిరాశలు, వైఫల్యాలను ఎదుర్కొన్న ఒక తండ్రి, తన కుటుంబ ఆశలన్నీ తన కొడుకుపై పెట్టుకుంటాడు. కానీ, 34 ఏళ్ల వయస్సులోనూ ఉద్యోగం లేక, చదువులో వెనుకబడిన ఆ కొడుకు, ఈ కథలో కీలకమైన వ్యక్తిగా నిలుస్తాడు. ఈ కుటుంబం తమ కలను సాకారం చేసుకుంటుందా అనే ప్రశ్నే ఈ సినిమా కథ. మధ్యతరగతి జీవితాల్లో సొంత ఇల్లు కొనుగోలు చేయడం అనేది కేవలం ఆర్థిక లక్ష్యం మాత్రమే కాదు, అది గౌరవం, స్థిరత్వం, సంతృప్తికి చిహ్నం. దర్శకుడు శ్రీ గణేష్ తన భావోద్వేగపూరిత రచన, ఆకట్టుకునే కథనంతో ఈ కథను అద్భుతంగా తీర్చిదిద్దారనే అనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేయండి మరి .