ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజా. తండ్రి నిర్మాత అయినా… కొడుకు మోహన్ కు మాత్రం మెగా ఫోన్ పట్టుకోవాలని కోరిక. 2001లో తెలుగు సినిమా హనుమాన్ జంక్షన్
తో తొలిసారి అతను దర్శకుడయ్యాడు. ఎడిటర్ మోహన్ మీద అభిమానంతో దర్శకరత్న దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఆ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సరిగ్గా ఇరవై యేళ్ళ క్రితం ఇదే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన స్పెషల్ సెట్ లో ఆ ప్రారంభోత్సవం ధూమ్ ధామ్ గా జరిగింది.
తొలిసారి దర్శకుడి హోదాలో మోహన్ రాజా స్టార్ కెమెరా యాక్షన్ అని ఆర్డర్ వేశాడు. ఈ ఇరవై సంవత్సరాల కాలంలో మొత్తం తొమ్మిది చిత్రాలను మోహన్ డైరెక్ట్ చేశాడు. అందులో తన తమ్ముడితో చేసిన రీమేక్సే ఎక్కువ. తొలి సినిమా తెలుగుదే అయినా… ఆ తర్వాత జయం
ను తమిళంలో తమ్ముడు రవితో రీమేక్ చేశాడు. దాంతో అతను జయం
రవిగా మారిపోయాడు. ఆ ఇద్దరి విజయయాత్ర అలా కొనసాగుతూనే ఉంది. విశేషం ఏమంటే… ఇప్పుడు మోహన్ రాజా తన పదో చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడు.
మలయాళ చిత్రం లూసిఫర్
కు రీమేక్ అయిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవలే దీని పూజా కార్యక్రమాలు జరిగాయి. మరో చిత్రం ఏమంటే… మోహన్ రాజా దర్శకత్వం వహించిన తొలి తెలుగు సినిమా కూడా మలయాళ చిత్రం తెన్ కాశి పట్టణం
కు రీమేకే! జగపతిబాబు, అర్జున్, వేణు ప్రధాన పాత్రలు పోషించిన ఆ సినిమాలో స్నేహ, లయ హీరోయిన్లుగా నటించారు. ఆ తొలిచిత్రం ఘన విజయం సాధించడంతో ఇక మోహన్ రాజా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే కలగలేదు. అందుకే అప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఆ ఆనందాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు మోహన్ రాజా!