Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవలే చిరు ఈ సినిమాలోని ఒక డైలాగ్ చెప్పి సంచలనం సృష్టించాడు. “రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను.. కానీ నా నుంచి రాజకీయాలు దూరం కాలేదు” అన్న ఒక్క డైలాగ్ తో చిరు సినీ, రాజకీయ రంగాల్లో ప్రకంపనలు సృష్టించాడు. ఇక ఈ డైలాగ్ సినిమాలోదా..? లేక నిజంగానే చిరు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నాడా..? అంటూ అభిమానులు పలు అనుమానాలను వ్యక్తం చేశారు.
ఇక తాజాగా ఈ డైలాగ్ పై చిరు ఎట్టకేలకు నోరు విప్పాడు. గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో చిరు మాట్లాడుతూ ” నా ఒక్క డైలాగ్ ఇంత ప్రభంజనం సృష్టిస్తుందని అనుకోలేదు. ఇది ఒక రకంగా మంచిదే. సినిమాకు మంచి ప్రమోషనా గా ఉపయోగపడింది” అని చమత్కరించారు. అయితే ఇది సినిమాలోని డైలాగే అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే వరుస ప్రమోషన్స్ తో గాడ్ ఫాదర్ జోరు పెంచింది. ఇక ఈ సినిమాలో నయనతార.. చిరుకు చెల్లిగా నటించగా.. హీరో సత్యదేవ్ ఒక కీలక పాత్రలో నటించాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.