ఫిలించాంబర్‌లో సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి నివాళులు అర్పించిన చిరంజీవి చిత్రపరిశ్రమకు సిరివెన్నెల లేని లోటు తీరనిది. ఎవరూ కూడా భర్తీ చేయలేనిది అన్నారు. సమాజాన్ని మేలుకొలిపే, సమాజం ఆలోచింపజేసేలా ఆయన మాటలు పాటలు ఉండేవి. కొద్ది రోజుల క్రితమే తన అనారోగ్య సమస్యలు తెలుసుకుని చెన్నై వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుందాం అని చెప్పాను. నేను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత చెన్నై వెళ్దామని సిరివెన్నెలకు చెప్పాను. ఇంతలోనే ఇలాంటి వార్త వింటామని ఊహించలేదు. కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లే ముందే నాతో ఫోన్లో మాట్లాడారు. పుట్టిన వెంటనే ఎవరూ మెగాస్టార్ కాలేరని అనేవారు అని చిరంజీవి అన్నారు.
మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్, అల్లు అరవింద్ కూడా సిరివెన్నెల పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ “నోట్లో నుంచి మాట రాట్లేదు. శాస్త్రిగారు అంటే చాలా ఇష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే బహుశా మా అమ్మానాన్నల తరువాత ఆయనే. నాకు తెలుగు మీద పట్టు తక్కువ. శాస్త్రిగారి పాటలు వింటే అర్థం కాకపోయినా అందులో డెప్త్ అర్థమయ్యేది. ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఆయన ఎప్పటికీ మన మనసులో బ్రతికే ఉంటారు” అంటూ సిరివెన్నెల మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో కూడా ఒక పాట రాశారు. ఒక తరం అయిపోయిందని, ఒక శకం అయిపోయిందని అందరూ అనుకోవడం సహజం. వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల ఒకతరం వారు. విశ్వనాథ్ గారితో కలిసి పని చేయడం కోసం ఎంత ఎదురు చూస్తామో.. అలాగే సిరివెన్నెల గారితో పని చేయడం నా అదృష్టం. ఆయన నన్ను ఎప్పుడూ బావగారూ బావగారూ అని పిలిచే వారు. ఆయనకు బన్నీ అంటే చాలా ఇష్టం. మనమధ్య ఆయన లేకుండా పోవడం చాలా విచారకరం. ఆయలేని లోటు ఎవరూ తీర్చలేనిది. ఆయన దగ్గర సరస్వతి తాండవిస్తుంది” అని అంటూ ఆయనతో ఉన్న జ్ఞాపకాలను స్మరించుకున్నారు.