Chalapathi Rao: ప్రముఖ నటుడు చలపతిరావు ‘గులాబి’ సినిమా తరువాత వరుసగా హీరోహీరోయిన్లకు తండ్రి పాత్రల్లో కనిపిస్తూ సాగారు. అంతకు ముందు అనేక చిత్రాలలో అమ్మాయిలను బలాత్కారం చేసే విలన్ గానూ కనిపించారు. దానికంటే ముందు చలపతిరావు నటజీవితంలో అధికభాగం నటరత్న యన్టీఆర్ చిత్రాలతోనే సాగింది. యన్టీఆర్ హీరోగా నటించిన ‘కథానాయకుడు’ చిత్రంలోనే చలపతిరావు తొలిసారి ఓ డైలాగ్ చెప్పే పాత్రలో కనిపించారు. ఆ తరువాత రామారావు హీరోగా రూపొందిన అనేక చిత్రాలలో చలపతిరావు, ఏదో ఒక పాత్రలో తెరపై తళుక్కుమనేవారు. అలాంటి చలపతిరావును యన్టీఆర్ తాను త్రిపాత్రాభినయం చేసి అలరించిన మహత్తర పౌరాణిక చిత్రం ‘దానవీరశూర కర్ణ’లో ఐదు పాత్రల్లో నటింప చేశారు. ‘దానవీరశూర కర్ణ’లో సూతునిగా, ఇంద్రునిగా, బ్రాహ్మణునిగా, జరాసంధునిగా, ధృష్టద్యుమ్నునిగా ఐదు పాత్రల్లో చలపతిరావు కనిపించడం విశేషం! ఈ విషయంలో “అన్నగారూ… నన్ను ఇన్ని పాత్రల్లో చూపిస్తే జనానికి బోర్ కొట్టదూ…” అని అడిగారట చలపతిరావు. “ఈ దేశంలో యన్టీఆర్ ఎవరో సరిగా తెలియనివారున్నారు, నిన్నెవరు గుర్తుపడతారు బ్రదర్…” అంటూ రామారావు తనదైన శైలిలో చెప్పారట. ఆ మాటకు కంగు తినడం చలపతిరావు వంతయింది.
ఇంతకూ ఒకే నటునితో బహుపాత్రలు చేయించడం అన్నది యన్టీఆర్ కు తన గురువు కేవీ రెడ్డి నుండే అలవడిందట! ‘పాతాళభైరవి’లో యన్టీఆర్ తోటరాముడుగా నటించగా, ఆయన మిత్రుడు అంజిగాడిగా బాలకృష్ణ నటించారు. ఇదే సినిమాలో తోటరాముడు చెట్టెక్కి అగ్నిగుండంలోకి దూకే సీన్ ఉంటుంది. అక్కడ చెట్టుపై అతనికి తారసపడే భూతం కూడా అంజి బాలకృష్ణనే కావడం విశేషం! ఇదే బాలకృష్ణతో కేవీ రెడ్డి తన ‘మాయాబజార్’లోనూ రెండు పాత్రలు చేయించారు. అందులో ఉత్తరకుమారుడుగా నటించిన రేలంగికి సహాయకునిగా ఉండే పాత్రలో అంజి నటించారు. అలాగే ఘటోత్కచుడు ద్వారకలో అడుగుపెట్టినప్పుడు ద్వారపాలకునిగా పాటపాడుతూ కనిపించేది బాలకృష్ణనే. అలా ఒకే నటునితో రెండు పాత్రలు చేయించడం అన్నది కేవీ రెడ్డి దగ్గరే యన్టీఆర్ గమనించారు. అందువల్లే తాను దర్శకత్వం వహించే చిత్రాలలో కొన్ని పాత్రలను ఒకే నటునితో చేయించారు. అలా చలపతిరావుకు కూడా ‘దానవీరశూర కర్ణ’లో ఐదు పాత్రలు పోషించే భాగ్యాన్ని కల్పించారు రామారావు.