Jana Nayagan: కావేరీ జలాల వివాదం మరోసారి కర్ణాటక, తమిళనాడు మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. 15 రోజుల పాటు ప్రతిరోజూ 3,500 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కావేరీ జల నియంత్రణ కమిటీ (CWRC) ఆదేశించడంతో కర్ణాటకలో నిరసనలు ఉధృతమయ్యాయి. ముఖ్యంగా మండ్య, మైసూరు జిల్లాల్లో రైతులు, కన్నడ సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. మండ్యలో నిరసనకారులు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా పోస్టర్లను చించివేశారు. ఆ సినిమా ప్రదర్శితమవుతున్న గురుశ్రీ థియేటర్‌ను ముట్టడించి ప్రదర్శన నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని థియేటర్ యాజమాన్యం ప్రదర్శనను నిలిపివేసినట్లు సమాచారం. అనంతరం కార్యకర్తలు థియేటర్ బయట నినాదాలు చేస్తూ తమ నిరసన కొనసాగించారు.
తమిళనాడుకు నీరు విడుదల చేయవద్దని డిమాండ్ చేస్తూ నిరసనకారులు జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం కర్ణాటకలో తీవ్రమైన తాగునీటి కొరత ఉందని, ప్రజలకు, పశువులకు సరిపడా నీరు కూడా అందుబాటులో లేదని వారు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క చుక్క నీటిని కూడా విడుదల చేయరాదని ప్రభుత్వాన్ని కోరారు. మండ్య ప్రజలు ఎప్పుడూ కర్ణాటక ప్రయోజనాల కోసం ముందుండి పోరాడారని, ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని నిరసనకారులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నీటిని విడుదల చేస్తే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించారు. మరోవైపు మైసూరు-బెంగళూరు జాతీయ రహదారిపై సర్ ఎం. విశ్వేశ్వరయ్య విగ్రహం సమీపంలో నిరసనకారులు రోడ్డును దిగ్బంధించడంతో భారీ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకుని ముందుజాగ్రత్తగా నిర్బంధించారు. మైసూరులో కూడా ఖాళీ కుండలతో ప్రదర్శనలు నిర్వహిస్తూ కావేరీ నీటిని తమిళనాడుకు విడుదల చేయొద్దని డిమాండ్ చేశారు.
ఈ పరిణామాలపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, CWRC ఆదేశంపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేస్తుందని, న్యాయపరమైన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. అలాగే కర్ణాటకలో నెలకొన్న నీటి సంక్షోభాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధులను కావేరీ జలాశయాలు సందర్శించాలని ఆహ్వానించారు. త మంగళవారం జారీ చేసిన ఆదేశాల్లో భాగంగా సుమారు నాలుగు టీఎంసీల నీటిని అందించేందుకు 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని CWRC సూచించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం మరోసారి వాడి వేడి రాజకీయ చర్చలకు దారితీసింది.

