టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదైంది. తన ఇంటిని కబ్జా చేశారంటూ ఫిల్మ్ నగర్ పోలీసు స్టేషన్‌లో నిర్మాత బెల్లంకొండపై శివ ప్రసాద్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఫిల్మ్ నగర్ రోడ్ నంబర్ 7లో తాళం వేసి ఉన్న తన ఇంటిని బెల్లంకొండ సురేష్ కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెల్లంకొండ సురేష్‌తో పాటుగా మరో వ్యక్తిపై బీఎన్ఎస్ 329 (4), 324 (5), 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
శివ ప్రసాద్ అనే వ్యక్తి ఫిల్మ్ నగర్ రోడ్డు నెంబర్ 7లో నివాసం ఉంటున్నారు. శివ ప్రసాద్ కొంతకాలంగా తన ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్లారు. మూడు రోజుల క్రితం బెల్లంకొండ సురేష్, ఆయన అనుచరులు ఆ తాళం పగలగొట్టారు. ఇంట్లో సామాగ్రి, గోడలు ధ్వంసం చేసి.. ఇంటిని ఆక్రమించేందుకు యత్నించారు. శివ ప్రసాద్ తన ఇంటికి రాగా.. ధ్వంసమైన ఇళ్లు, వస్తువులను చూసి షాక్ అయ్యారు. విషయం తెలుసుకొని తన సిబ్బందిని బెల్లంకొండ సురేష్ ఇంటికి పంపారు. శివ ప్రసాద్ సిబ్బందిపై సురేష్ అసభ్యకరంగా దూషిస్తూ దాడికి యత్నించారు. దాంతో శివ ప్రసాద్ ఫిల్మ్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Delhi Car Blast: ఢిల్లీ పేలుడు ఘటన.. దర్యాప్తులో కీలక విషయాలు ఇవే!
ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ సినిమా నిర్మాణంలో చురుగ్గా లేరు. కానీ ఆయన కుమారులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్ సినిమాలు చేస్తున్నారు. సాయి శ్రీనివాస్ వరుసగా సినిమాలు చేస్తూ సత్తాచాటుతున్నారు. తాజాగా కిష్కింధపురితో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో ఆయన నాలుగైదు ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్నారు. మరోవైపు గణేష్ నటించిన స్వాతిముత్యం సినిమా పెద్దగా ఆడలేదు.