నవ్వుకే నవ్వు పుట్టించగల సమర్థుడు హాస్యనటబ్రహ్మ బ్రహ్మానందం. ‘నవ్వు, నవ్వించు, ఆ నవ్వులు పండించు’ అన్నట్టుగా ఎప్పుడూ నవ్వుతూనే కనిపించే బ్రహ్మానందం చిత్రసీమలో తన నవ్వుల నావ నడపడానికి ముందు చిరునవ్వుతోటి విషవలయాలను ఛేదిస్తూ ముందుకు సాగారు. చిన్నప్పటి నుంచీ నవ్వునే నమ్ముకొని హాస్యబలం పెంచుకున్నారు. బాల్యంలోనే తనకు తెలిసిన వారిని అనుకరిస్తూ, వారి చేష్టలను చూపించి తన చుట్టూ ఉన్న వారికి నవ్వులు పంచేవారు. ఏ ముహూర్తాన ఆయన కన్నవారు బ్రహ్మానందం అని నామకరణం చేశారో కానీ, అందరికీ ఆనందం పంచడానికే ఈ బ్రహ్మానందం అన్నట్టుగా ఆయన చలన చిత్రజీవితం సాగింది.
కన్నెగంటి బ్రహ్మానందం 1956 ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జన్మించారు. ఎంతగా నవ్వులు పూయించినా, శ్రద్ధగా చదువుకొని అధ్యాపకునిగా మారారు. అత్తిలిలో అధ్యాపకునిగా కొనసాగుతూనే బ్రహ్మానందం పలు సాంస్కృతిక కార్యక్రమాలలో తన స్వరఅనుకరణతో అలరించే వారు. దూరదర్శన్ లో బ్రహ్మానందం పండించిన ‘పకపకలు’ ఇప్పటికీ గుర్తు చేసుకొని నవ్వుకొనేవారెందరో! జంధ్యాల ‘సత్యాగ్రహం’లో ఓ చిన్న పాత్రలో తొలిసారి కనిపించారు బ్రహ్మానందం. వేజెళ్ళ సత్యనారాయణ ‘శ్రీతాతావతారం’లోనూ ఓ బిట్ రోల్ చేశారు. జంధ్యాల ‘అహ నా పెళ్ళంట’లో అరగుండుగా నటించి, అందరికీ దగ్గరయ్యారు బ్రహ్మానందం. ఆ తరువాత ఆయన మరి వెనుదిరిగి చూసుకోలేదు. అందిన ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ సాగారు. అందరికీ నవ్వులు పంచుతూనే తెలుగునాట హాస్యనటుల్లో అగ్రస్థానం అధిరోహించారు. బ్రహ్మానందానికి ముందు రేలంగి, అల్లు రామలింగయ్య ఇద్దరూ తమదైన హాస్యంతో పకపకలు పండించారు. వారిద్దరికీ పద్మ పురస్కారం లభించింది. వారి తరువాత తెలుగునాట ‘పద్మ’ పురస్కారం అందుకున్న నవ్వుల రేడు బ్రహ్మానందమే!
ఒకటా రెండా వందలాది చిత్రాల్లో బ్రహ్మానందం పండించిన నవ్వులు జనానికి కితకితలుపెట్టాయి. ఈ నాటికీ వాటిని తలచుకుంటే చాలు గొల్లున నవ్వులు రాలతాయి. బ్రహ్మానందం హాస్యానికి ఇప్పటికి ఐదు సార్లు నంది పురస్కారాలు దక్కాయి. “మనీ, అనగనగా ఒక రోజు, వినోదం, రెడీ, రేసుగుర్రం” చిత్రాలతో ఉత్తమ హాస్యనటునిగా ఐదు నందులు అందుకున్నారు. ఈ కామెడీ కింగ్ కరుణరసంతోనూ మురిపించిన సందర్భాలున్నాయి. అలా ఉత్తమ సహాయనటునిగానూ ‘అన్న’తో నందిని పట్టుకుపోయారు. ఇలా ఆరు సార్లు నందిని అందుకున్న బ్రహ్మానందం, వెయ్యికి పైగా చిత్రాలలో నటించి, ఈ నాటికీ నవ్వులు పూయిస్తున్న హాస్యనటునిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్స్ లోనూ చోటు సంపాదించారు.
తెలుగు హాస్యనటుల చరిత్ర రాయవలసి వస్తే, బ్రహ్మానందానికి ముందు, బ్రహ్మానందానికి తరువాత అని రాయాలని పలువురు ప్రముఖులు ప్రశంసించిన సందర్భాలున్నాయి. బ్రహ్మానందం కామెడీతో జనానికి కడుపులు చెక్కలు కావడం మొదలయిన తరువాత నుంచీ హాస్యాభినయంపై మమకారం పెంచుకున్న వారెందరో ఉన్నారు. బ్రహ్మానందం చూపిన బాటలో ‘మిమిక్రీ’ చేస్తూ హాస్యం పంచవచ్చునని భావించిన వారు తొలుత స్వర అనుకరణతో జనాన్ని మెప్పించి, తరువాత చిత్రసీమలో రాణించారు. అలాంటివారికి సైతం బ్రహ్మానందం తగిన ప్రోత్సాహమిచ్చారు. ఇక తమ హాస్యనటుల్లో కూడా కథానాయకులుగా రాణించగల దిట్టలు ఉన్నారంటే, వారికీ తగిన ప్రోత్సాహం అందించారు. తమ హాస్యకుటుంబంలోని కొందరు సభ్యులు దర్శకులుగా మారడానికీ ఆయన ప్రోత్సాహమే కారణం. అందుకే తెలుగు సినిమా హాస్య చరిత్రలో బ్రహ్మానందంకు ముందు, తరువాత అని రాయాల్సి ఉంటుందని అంటారు.
మొన్నటి దాకా తీరిక లేకుండా నవ్వులు పండించిన ఈ హాస్యనటబ్రహ్మ, కరోనా కల్లోలంలో ఇంటిపట్టునే ఉండి తనలోని ఇతర కళలను బయట పెట్టారు. చిత్రలేఖనంలో బ్రహ్మానందం బాణీ చూసి నిత్య చిత్రకారులు సైతం నివ్వెర పోయారు. బ్రహ్మానందం ఉంటే చాలు అనుకొనేవారు ఆయన తమ చిత్రాల్లో ఉండాలని కోరుకుంటున్నారు. ఆయనకు మునుపటిలా అవకాశాలు లేవని కొందరు భావించవచ్చు. ఇంకా అవకాశాల వెంట పరుగులు తీసే స్థాయిలో ఆయన లేరు. ఆయన నవ్వులు కేవలం తెలుగువారినే కాదు, తెలుగు అర్థం కాని వారినీ అలరించాయి. తెలుగు నుండి తమ భాషల్లోకి అనువాదమైన చిత్రాలలో బ్రహ్మానందం హాస్యాభినయం చూసి పరభాషల వారు సైతం కితకితలకు గురవుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇంతలా నవ్వులు పూయించిన బ్రహ్మానందం మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.