దర్శకుడిగా రాజ్ కుమార్ హిరాణీ గొప్పదనం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులకు తెలుసు. ఆయన తెరకెక్కించిన ‘మున్నాభాయ్’, ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’ సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఆయనకు సినిమా రంగంలోనూ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటి అభిమాన దర్శకుడి నుంచి ఓ ప్రశంసాపూర్వక సందేశం అందితే ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉంటుంది. ఆ గౌరవాన్ని తాజాగా అందుకున్నారు దర్శకుడు సుకుమార్. ఆయన ఇటీవలి సినిమా ‘పుష్ప’ సినిమా బాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది. ఈ క్రమంలో ఎంతోమంది అక్కడి ప్రముఖులు దర్శకుడు సుకుమార్ ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ఇందులో అరుదైన దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ కూడా చేరారు.
రాజ్ కుమార్ హిరాణీ, ” డియర్ సుకుమార్ ఈ మెసేజ్ మీకు ఎప్పుడో పంపించాల్సింది. ‘పుష్ప’ సినిమా చూసినప్పటి నుంచి మీతో మాట్లాడాలని అనుకుంటున్నా, నా దగ్గర మీ నెంబర్ లేదు. ఒక మిత్రుడు ద్వారా తీసుకున్నా. ‘పుష్ప’ సినిమా గురించి నా మిత్రులతో చాలాసార్లు మాట్లాడాను. ఒక సినిమా గురించి నేను అంతలా మాట్లాడటం వారిని ఆశ్చర్యపరిచి ఉంటుంది. మీ రచన, ప్రతి సన్నివేశాన్ని మలిచిన తీరు, నటీనటుల పర్మార్మెన్స్, సంగీతం ఇలా అన్నీ గొప్పగా ఉన్నాయి. అద్భుతమైన సినిమాను తెరకెక్కించారు. సినిమాను ఆద్యంతం ఆస్వాదించాను. మీరు ముంబై వస్తే ఫోన్ చేయండి. మీట్ అవుదాం” అని సుకుమార్ కు సందేశం పంపారు.
దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ సందేశానికి ఎంతో సంతోషంగా కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు సుకుమార్. ఆయన స్పందిస్తూ, ”ఫిల్మ్ మేకింగ్ లో మాస్టర్ లాంటి మీ దగ్గర నుంచి ప్రశంసలు రావడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. రైటింగ్ లో, సినిమా రూపకల్పనలో మీరే నాకు స్ఫూర్తి. మీ మెసేజ్ ను నా స్నేహితులందరికీ పంపిస్తున్నాను’ అని అన్నారు. బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ ప్రశంసలతో… సహజంగానే ‘పుష్ప -2’కు ఉత్తరాదిన మరింత క్రేజ్ వచ్చే ఆస్కారం ఉంది.