గత రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వైరస్ కరోనా.. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ నుంచి తప్పించుకున్నాం అనుకొనేలోపు మరోసారి కరోనా కోరలు చాస్తోంది. చాప కింద నీరులా మారి ప్రపంచాన్ని మళ్లీ వణికిస్తోంది. ఇక చిత్ర పరిశ్రమలో కరోనా కలకలం మళ్లీ మొదలయ్యింది. తాజాగా బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీలో కరోనా కలకలం రేగింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురికి కరోనా రావడం చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కొడుకు అర్జున్ కపూర్, కూతురు అన్షులా కపూర్, అనిల్ కపూర్ కూతురు రియా కపూర్, ఆమె భర్త కరణ్ బులానీలు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని రియా కపూర్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం అర్జున్ కపూర్ ఒక హోటల్ లో ఐసోలేషన్ లోన్ ఉన్నట్లు తెలుస్తోంది. మిగతావారందరు తమ ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. బోనీ కపూర్ కి కూడా ట్రస్టులు చేయగా అయన నెగిటివ్ తో బయటపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కపూర్ ఫ్యామిలీకి కరోనా రావడంతో బాలీవుడ్ అంతా షాక్ కి గురవుతున్నారు.