Bimbisara Success Press Meet: ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ హీరోగా హరికృష్ణ నిర్మించిన ‘బింబిసార’ చిత్ర బృందం క్లౌడ్ నైన్ లో ఉంది. తొలి ఆట నుండే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడంతో పలు కేంద్రాలలో థియేటర్లను పెంచుతున్నారు. మార్నింగ్ షో రిపోర్ట్ అందుకున్న వెంటనే చిత్ర బృందం నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో కళ్యాణ్ రామ్ ఈ చిత్ర విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ‘బింబిసారుడి పాత్రకు న్యాయం చేస్తాననే నమ్మకం తనకంటే దర్శకుడు వశిష్ఠకు ఎక్కువ ఉండేదని, అతని నమ్మకాన్ని ఇవాళ ప్రేక్షకులు నిజం చేయడం ఆనందంగా ఉంద’ని కళ్యాణ్ రామ్ అన్నారు. ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించిన కీరవాణి, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్, విఎఫ్ఎక్స్ ఇన్ ఛార్జ్ అనీల్, ఫైట్ మాస్టర్స్ రామకృష్ణ, వెంకట్; మాటల రచయిత వాసుదేవకు కళ్యాణ్ రామ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన చిన్నారిని కళ్యాణ్ రామ్ అభినందించారు. ఇందులో ధన్వంతరి పురానికి సంబంధించిన ఎపిసోడ్ ను ఎనిమిది రాత్రిళ్ళు చిత్రీకరించామని, ఆ సమయంలో నిద్ర ఆపుకుని ఎంతో కష్టపడి ఆ చిన్నారి తన పాత్రను పోషించిందని కితాబిచ్చారు. ఈ సినిమాను చూసిన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల విడుదల హక్కులను తీసుకున్న ‘దిల్’ రాజు, శిరీశ్ కు కళ్యాణ్ రామ్ కృతజ్ఞతలు తెలిపారు. అలానే ఈ సినిమా చూసి మెచ్చిన తన తమ్ముడు ఎన్టీయార్ కూ ధన్యవాదాలు చెప్పారు.
విడుదలకు ముందు పలు ఇంటర్వ్యూలలో చెప్పినట్టుగానే ‘బింబిసార’ చిత్రానికి తప్పకుండా సీక్వెల్ ఉంటుందని, పార్ట్ 2 ను మరింత రిచ్ గా, బిగ్గర్ గా, బెటర్ ఫాంటసీగా తెరకెక్కిస్తామని, ఆ బాధ్యతను వశిష్ఠకే అప్పగిస్తున్నాన’ని కళ్యాణ్ రామ్ అన్నారు. ఈ సమావేశానంతరం యూనిట్ సభ్యులు విజయాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. రాబోయే ‘బింబిసార -2’లో ఎన్టీయార్ సైతం ఓ కీలక పాత్ర పోషిస్తాడనే వార్తలు ఇప్పటి నుండే ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.