ప్రియదర్శన్ రూపొందించిన ‘భూల్ భులయ్యా’ చిత్రం 2007లో విడుదలై చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి హారర్ కామెడీ చిత్రంలో అక్షయ్ కుమార్, విద్యాబాలన్, షైనీ అహూజా కీలక పాత్రలు పోషించారు. మళ్లీ ఇంతకాలానికి అదే పేరుతో ‘భూల్ భులయ్యా -2’ మూవీ వస్తోంది. తొలి చిత్రంలో కీలక పాత్ర పోషించిన రాజ్ పాల్ యాదవ్ ఈ సినిమాలోనూ నటించాడు. అతనితో పాటు ఇప్పుడీ సినిమాలో కార్తిక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబు కీ-రోల్స్ చేశారు. ‘నో ఎంట్రీ, వెల్ కమ్, హల్ చల్, సింగ్ ఈజ్ కింగ్’ తదితర చిత్రాలను రూపొందించిన అనీశ్ బాజ్మీ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. మే 20న ‘భూల్ భులయ్యా’ విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. పదిహేను సంవత్సరాల తర్వాత మంజులికా అనే ఆత్మ బయటకు వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదాన్ని ఈ మూవీలో చూపించబోతున్నారు. ఆత్మల మధ్య పెరిగి పెద్దవాడిని అయ్యానని గొప్పలు చెప్పే హీరో అవే ఆత్మలు కళ్ళముందు సాక్షాత్కారమైతే ఏం చేశాడనేదాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించారు అనీశ్ బాజ్మీ. మూడు నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్ చూస్తుంటే… గతంలో వచ్చిన అనేక హారర్ ఎంటర్ టైనర్స్ కళ్ళముందు మెదులుతున్నాయి.