పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా చిత్రం నుండి తాజాగా టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్సె రిలీజ్ చేశారు. “భీమ్లా నాయక్” అనే టైటిల్ ను ప్రకటిస్తూ పవన్ లుక్ ను, వీడియోను విడుదల చేశారు. ఇక వీడియోలో పవర్ స్టార్ దుమ్మురేపాడు. ఇది దుమ్ము రేపడం ఖాయం. మరి సినిమాలో రానా ఎక్కడ ? అందరికీ ఇదే డౌట్ వస్తోంది. సినిమా మొదలైనప్పటి నుంచి దీనిని పవన్ మూవీగానే చూస్తున్నారు. ప్రమోషన్లు చేస్తున్నారు. రానా కూడా స్టార్ హీరోనే అయినప్పటికీ ఇప్పటివరకూ ఎక్కడా ఆయన పేరును కూడా లేవనెత్తలేదు. దీంతో ఇంతకీ ఇది మల్టీస్టారరేనా ? అనే అనుమానం వస్తోంది అందరికీ. మలయాళంలో అయితే ఇద్దరు హీరోలకూ సమ ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాకుండా టైటిల్ లోనూ రెండు పాత్రల పేర్లనే కలిపి పెట్టారు. కానీ తెలుగులో మాత్రం ఒక్క పవన్ పాత్ర పేరునే హైలెట్ చేశారు. పైగా సినిమాకు కూడా పవన్ పోషించిన “భీమ్లా నాయక్” పేరునే పెట్టేశారు. అప్పుడు ఇది మల్టీస్టారర్ ఎలా అవుతుంది ? కేవలం సోలో హీరో మూవీనే అవుతుంది. రానా లాంటి మంచి నటుడిని ఉపయోగించుకోలేకపోతున్నారు అంటున్నారు. మొత్తానికే ఆయనను సినిమా నుంచి పక్కకు పెట్టేశారని రానా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో నడుస్తున్న టాక్ కూడా ఇదే.
Read Also : “భీమ్లా నాయక్” వచ్చేశాడు… పవర్ ప్యాక్డ్ గ్లిమ్స్
ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా ఇదే ప్రశ్న అడిగాడు. “మల్టీస్టారర్ మూవీని సోలో హీరో మూవీ చేసేశారు” అంటూ ట్వీట్ చేశాడు. సదరు నెటిజన్ ట్వీట్ పై స్పందించిన “భీమ్లా నాయక్” నిర్మాత నాగ వంశీ అప్పుడే ఒక నిర్ధారణకు రావొద్దని, అన్నీ ఆర్డర్ ప్రకారంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు. అంటే త్వరలోనే సినిమాలో రానాకు సంబంధించిన ప్రమోషన్లు, సర్ప్రైజ్ లు ప్లాన్ చేసినట్టున్నారు మేకర్స్. మరి అవి ఎప్పుడు బయటపెడతారో చూడాలి. రానా అభిమానుల్లో నిరసన పెరగక ముందే స్టార్ట్ చేస్తే మంచిది అంటున్నారు.
ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్‌లు రాస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12 న విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2 నుండి మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభిస్తామని మేకర్స్ ప్రకటించారు.