Bhamakalapam 2 Teaser: వెబ్ సిరీస్ లు ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఓటిటీ మేకర్స్ సైతం అభిమానులకు కొత్తదనాన్నీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలతో వినోదాన్ని పంచుతూ ఆహా ఓటీటీ ఎంతగానో పాపులర్ అయింది.ఇప్పటివరకు ఎన్నో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు అందించిన ఆహా ఓటీటీ తాజాగా మరో ఒరిజినల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇదివరకు ఆహా ఓటీటీలో భామాకలాపం మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. హీరోయిన్ ప్రియమణి, శరణ్య ప్రదీప్ నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.విజనరీ డైరెక్టర్ అభిమన్యు తాడిమేటి తెరకెక్కించిన భామాకలాపం ఫిబ్రవరి 11న 2022లో విడుదలై అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.నాలుగు మిలియన్స్‌కు పైగా వ్యూయింగ్‌ను సాధించి రికార్డ్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా భామాకలాపం 2 రానుంది. ఇప్పటికే భామాకలాపం 2 నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఇక తాజాగా భామాకలాపం 2 టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. భామాకలాపం సీజన్ 1 లో అనుపమ(ప్రియమణి) చేసిన పనులకు విసుగొచ్చిన భర్త.. ఆ ఇంటి నుంచి మరో కొత్త ఇంటికి కుటుంబంతో సహా షిఫ్ట్ అవుతున్న సమయంలో అనుపమకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో టీజర్ మొదలయ్యింది. ఇక భర్త వార్నింగ్ కు తలొగ్గినట్లు అనుపమ.. భరత్ అనే నేను లో మహేష్ బాబు ప్రమాణం చేసినట్లు.. ” అనుపమ అనే నేను.. పక్కనవాళ్ల విషయాల్లో తలదూర్చను అని, నా పని నేను చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటాను అని మాట ఇస్తున్నాను” అని భర్తకు ప్రామిస్ చేస్తుంది. కానీ, అందులో ఏ ఒక్కటి చేయకుండా మళ్లీ పక్కవారి పనుల్లో తలదూర్చి.. కొన్ని హత్యలకు కారణం అవుతుంది. సీజన్ 1 లో బంగారు గుడ్డు కోసం అనుపమ పోరాడగా.. ఈసారి బంగారు కోడిపెట్ట కోసం ఆమె పోరాడుతున్నట్లు చూపించారు. ఇక అనుపమకు తోడుగా పనిమనిషి ఉంటుంది. వీరిద్దరి కామెడీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక చివర్లో ” ఏ మాటకు ఆ మాట అక్క.. నీకు, శవాలకు బాగా డీప్ కనెక్షన్ ఉన్నట్టుంది కదా .. అయితే వాటి దగ్గరకు నువ్వైనా పోతావ్.. లేకపోతే అవే నీ దగ్గరకు వస్తాయ్” అంటూ పనిమనిషి చెప్పడం హైలైట్ గా మారింది. ఫిబ్రవరి 16 నుంచి భామాకలాపం 2 ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈసారి ఈ డేంజరస్ లేడీ ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తుందో చూడాలి.