ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా తెలుగుచిత్రసీమలో పోటీ అంటే మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ మధ్య సాగేదే! దాదాపు నలభై ఏళ్ళ నుంచీ ఈ ఇద్దరు స్టార్ హీరోస్ బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతూనే ఉన్నారు. ఇంతకాలం పోటీ పడ్డ స్టార్ హీరోస్ దేశంలోనే వీరిద్దరూ కాకుండా వేరెవ్వరూ కనిపించరంటే అతిశయోక్తి కాదు! విశేషమేమంటే, వీరి తరువాత మరో రెండు తరాల హీరోలు వచ్చి రాజ్యంచేస్తున్నా, పోటీ అంటే మాదే అంటూ సాగుతున్నారు చిరంజీవి, బాలకృష్ణ. అలాంటి ఇద్దరు మాస్ హీరోలతో ఏకకాలంలో రెండు సినిమాలు రూపొందించడమే ఓ విశేషం అనుకుంటే, వాటిని ఒక్క రోజు తేడాతో సంక్రాంతికే విడుదల చేయడం మరింత విశేషం! అలాంటి ఫీట్ తెలుగు సినిమా రంగంలో ఇప్పటి దాకా ఏ నిర్మాణ సంస్థ చేసింది లేదు. ఆ క్రెడిట్ ను మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు యెర్నేని నవీన్, వై.రవిశంకర్ కే దక్కింది. ఈ సంస్థ బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి’, చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’నిర్మించింది. ఈ చిత్రాల మధ్య పోటీ ఏ స్థాయిలో సాగిందో అందరికీ తెలిసిందే. రెండు సినిమాలనూ ఒకే సంస్థ నిర్మించడంతో అభిమానుల నుండి నిర్మాతలకు ఇబ్బంది కూడా ఎదురయింది. అక్కడే మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలను అందరూ ఇప్పుడు అభినందిస్తున్నారు.
ఎలాగంటే ఓ రోజు ముందుగా అంటే జనవరి 12న ‘వీరసింహారెడ్డి’ విడుదల కాగా, ఆ సినిమాకు మొదటి రోజు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వచ్చినట్టు ప్రకటించి, బాలయ్య ఫ్యాన్స్ ను సంతోషపరిచారు. తరువాత రోజు జనవరి 13న వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’కు మొదటివారం కలెక్షన్స్ లో రికార్డు చూపించారు. ఇక చిరంజీవి సినిమా, బాలయ్య చిత్రం కంటే ఎక్కువ కేంద్రాలలో యాభై రోజులు ఆడినట్టూ ప్రకటించారు. చిరంజీవిదే బాలయ్యపై పైచేయి అనీ మెగాస్టార్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. అయితే మొదట్లో ఎన్ని కలెక్షన్స్, ఎన్ని రికార్డులు ప్రకటించుకున్నా సినీఫ్యాన్స్ కు కావలసింది ఓ సినిమా వంద రోజులు ఎన్ని కేంద్రాలలో ఆడిందన్నదే లెక్క. అక్కడ బాలయ్య ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’పై పైచేయి సాధించింది. ఈ మధ్యకాలంలో ఎనిమిది కేంద్రాలలో (మూడు డైరెక్ట్, ఐదు సింగిల్ షిఫ్ట్) శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగా ‘వీరసింహారెడ్డి’ నిలచింది. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ వందరోజుల బొమ్మ వేసి సరి అనిపించారు. ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా ఇద్దరు స్టార్ హీరోస్ ఫ్యాన్స్ ను సంతోషంలో ముంచెత్తి తమదైన బాణీ పలికించారు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు! ప్లాన్ అంటే అలా ఉండాలి మరి అంటున్నారు టాలీవుడ్ జనం!