సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, దళపతి విజయ్ అభిమానుల మధ్య ఒక ఆసక్తికరమైన వార్ నడుస్తోంది. థియేటర్లలో ‘అఖండ-2’ విజయవంతంగా ప్రదర్శించబడుతుండగానే, అకస్మాత్తుగా రెండేళ్ల క్రితం విడుదలైన ‘భగవంత్ కేసరి’ సినిమా మళ్ళీ ట్రెండింగ్‌లోకి రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీనికి ప్రధాన కారణం విజయ్ నటించిన తాజా చిత్రం ‘జన నాయగన్’. తమిళ స్టార్ హీరో విజయ్ తన రాజకీయ ప్రవేశానికి ముందు చేస్తున్న చివరి సినిమా ‘జన నాయగన్’. ఈ చిత్రం తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో విడుదలవుతోంది. అయితే, ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ పేరు మారుమోగుతోంది. దీనికి కారణం.. ఈ రెండు సినిమాల మధ్య ఉన్న పోలికలే.’జన నాయగన్’ చిత్రం ‘భగవంత్ కేసరి’కి అధికారిక రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. కథ పరంగా రీమేక్ చేయడంలో తప్పులేకపోయినా, విజయ్ క్యారెక్టరైజేషన్ విషయంలోనే అసలు వివాదం మొదలైంది.
Also Read:Sankranthi: రేపటి తీర్పుపై ప్రభాస్, చిరు సినిమాల భవితవ్యం.. టికెట్ రేట్లపై ఉత్కంఠ!
‘భగవంత్ కేసరి’లో బాలకృష్ణ తన వయసుకు తగ్గట్టుగా చాలా హుందాగా, ఒక బాధ్యతాయుతమైన గార్డియన్‌గా కనిపించారు. ట్రైలర్ చూసిన నందమూరి ఫ్యాన్స్ మరియు యాంటీ ఫ్యాన్స్.. విజయ్ క్యారెక్టరైజేషన్ చాలా ‘అల్లరి చిల్లరి’గా ఉందని, బాలయ్య గ్రేస్ ముందు విజయ్ తేలిపోయాడని విమర్శిస్తున్నారు. చిత్రమేమిటంటే.. ‘జన నాయగన్’ విడుదల కాకముందే, ఆ కథ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి తమిళ తంబీలు ఎగబడి మరి ఓటీటీలో ‘భగవంత్ కేసరి’ని చూస్తున్నారు. దీనివల్ల ఈ సినిమా విడుదలైన రెండేళ్ల తర్వాత మళ్ళీ టాప్ ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే ఈ కథను చూసేయడం వల్ల, డబ్బింగ్ వెర్షన్ ‘జన నాయకుడు’పై ఇక్కడ పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. విజయ్ త్వరలో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్తున్న తరుణంలో, ఈ సినిమాలో కథ కంటే రాజకీయ డైలాగులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘భగవంత్ కేసరి’లో ఉండే బలమైన సందేశాన్ని పక్కన పెట్టి, రాజకీయ లబ్ధి కోసం డైలాగ్స్ మార్చడంపై సినిమా క్రిటిక్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సందేశాన్ని రాజకీయాలు డామినేట్ చేయడం వల్లే ఒరిజినాలిటీ దెబ్బతిందని ట్రోల్స్ వస్తున్నాయి.