సంక్రాంతి బరిలో నిలిచిన భారీ చిత్రాలకు తెలంగాణాలో ఊహించని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. టాలీవుడ్ అగ్ర హీరోలు ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల టికెట్ ధరలు, అదనపు షోల వ్యవహారం ఇప్పుడు హైకోర్టు గడప తొక్కింది. సంక్రాంతి పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైన పెద్ద సినిమాలకు హైకోర్టులో టికెట్ ధరల పెంపు, అదనపు షోల అనుమతిపై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇరు చిత్రాల నిర్మాతలు డివిజన్ బెంచ్ ముందు అప్పీలు దాఖలు చేశారు. గత విచారణలో సింగిల్ బెంచ్ జడ్జి టికెట్ ధరలను పెంచడానికి, ప్రత్యేక షోలను నిర్వహించడానికి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాలకు సాధారణ ధరలతో వసూళ్లు రాబట్టడం కష్టమని ఆ ఉత్తర్వులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ డివిజన్ బెంచ్‌ను నిర్మాతలు ఆశ్రయించారు.
Also Read:Ayalaan Telugu OTT Release: థియేటర్ కన్న ముందే ఓటీటీకి రాబోతున్న తమిళ స్టార్ హీరో..
తమ చిత్రాలకు సంబంధించి టికెట్ ధరల పెంపు మరియు అదనపు షోల కోసం ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నామని, ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించేలా హోంశాఖకు ఆదేశాలు ఇవ్వాలని నిర్మాతల తరపు న్యాయవాదులు పిటిషన్‌లో కోరారు. సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నందున, ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని నిర్మాతల తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేయగా అందుకు హైకోర్టు నిరాకరించింది. అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ, ఈ కేసులను రేపు విచారిస్తామని కోర్టు వెల్లడించింది. ఇక రేపు హైకోర్టులో జరిగే విచారణపైనే ఈ రెండు చిత్రాల బాక్సాఫీస్ భవితవ్యం ఆధారపడి ఉంది ఒకవేళ కోర్టు సానుకూలంగా స్పందించి టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, పండుగ వసూళ్లు రికార్డు స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులకే మొగ్గు చూపితే మాత్రం నిర్మాతలకు, పంపిణీదారులకు భారీ నష్టం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి రేపటి విచారణలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందో చూడాలి!