నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీనిస్తూ దూసుకెళ్తున్నారు. ఇప్పటికీ ఫుల్ స్పీడ్ తో వరుస సినిమాలను చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే ‘అఖండ’ చిత్రంతో అఖండ విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు చిత్రబృందంతో కలిసి మూవీ సక్సెస్ టూర్ లో ఉన్నారు. ఇక ఆయన నెక్స్ట్ మూవీ సైతం యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మల్టీస్టారర్ ల జోరు నడుస్తోంది. సీనియర్ హీరోల నుంచి యంగ్ ట్యాలెంట్ వరకూ అందరూ మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే బాలయ్య మాత్రం ఇంకా తనకు సరైన పోటీనివ్వగల హీరోతో ఇంతవరకూ మల్టీస్టారర్ ను చేయలేదు. కొన్ని సినిమాల్లో కీలకపాత్రల్లో కనిపించినప్పటికీ అవి పూర్తి స్థాయి మల్టీస్టారర్ కాదు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ను, బాలయ్యను ఒకే ఫ్రేమ్ లో చూడాలని నందమూరి అభిమానులు తహతహలాడుతున్నారు. ఈ కాంబినేషన్ ఎప్పటికీ ఫిక్స్ అవుతుందో ఏమో గానీ తాజాగా మల్టీస్టారర్ మూవీపై బాలయ్య స్పందించారు.
Read Also : ఆన్లైన్ టిక్కెటింగ్ జీవో రద్దుపై బాలయ్య రియాక్షన్
‘అఖండ’ సినిమా విజయవంతం అయిన సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న బాలయ్య మీడియాతో మాట్లాడుతూ మల్టీస్టారర్ మూవీ చేయడంపై స్పందించారు. మల్టీస్టారర్ గురించి బాలయ్య మాట్లాడుతూ “సినిమా కథ బాగుంటే ఖచ్చితంగా మల్టీస్టారర్ చేస్తాను. సరైన కాస్టింగ్ ను బట్టి నిర్ణయం తీసుకుంటాము. అంతా అమ్మవారు ఇచ్చిన ప్రేరణ… నేను మల్టీస్టారర్ చేయడానికి నేను ఎప్పుడూ కాదనలేదు. కానీ అవతలి వారికి ధైర్యం ఉండాలి కదా… నాకైతే ధైర్యం ఉంది. నేను మల్టీస్టారర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని తెలిపారు. మరి బాలయ్యతో కలిసి నటించడానికి ఏ నటుడు, బాలయ్యతో మరో హీరోను తెరపై చూపించడానికి ఏ దర్శకుడు ధైర్యం చేస్తారో చూడాలి.