Baladitya Nominated By 8 Members In Bigg Boss House: బిగ్ బాస్ సీజన్ 6లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి రాముడు మంచి బాలుడు తరహాలో అందరికీ ఏ అవసరం వచ్చినా పెద్దన్నలా సాయం చేస్తున్నాడు బాలాదిత్య. అంతేకాదు… అతని వాక్ చాతుర్యంతో అందరినీ మెప్పించి, మెజారిటీ ఇంటి సభ్యుల మనసుల్నీ గెలుచుకున్నాడు. నామినేషన్స్ లో భాగంగా అతను ఎవరినైనా నామినేట్ చేసినా…. ‘మీరు తప్పకుండా ప్రేక్షకుల ఓట్లు గెలుచుకుంటారు… అందుకే మిమ్మల్ని నామినేట్ చేశాను’ అంటూ వారిలో కొత్త ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించే వాడు. అయితే ఆ మధ్య నాగార్జున మరీ ‘అందరివాడు’లా ప్రవర్తించకని హితవు పలికిన తర్వాత బాలాదిత్య పరుల కోసం పాటు పడటం మానేసి, తన కోసం గేమ్ ఆడటం మొదలెట్టాడు. అక్కడి నుండే అతనికి కష్టాలు మొదలయ్యాయి.
మొదటగా గీతూ రాయల్ నుండి బాలాదిత్యకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కొన్ని సందర్భాలలో తాను ఏ కారణంగా గీతూను టార్గెట్ చేశాడో చెప్పడానికి బాలాదిత్య ప్రయత్నించినా, ఆమె వినడానికి ఆసక్తి చూపలేదు. ఆ గ్యాప్ రోజు రోజుకూ పెరుగుతోంది తప్పితే తగ్గడం లేదు. అలానే రాజశేఖర్ లాంటి వాళ్ళతోనూ బాలాదిత్యకు చెడింది. తాజాగా ఈ వారం నామినేషన్స్ టైమ్ లో తనను నామినేట్ చేసిన రాజశేఖర్ తో బాలాదిత్య వాదనకు దిగాడు. తనలాగానే రాజశేఖర్ ఆలోచిస్తున్నాడని, ఈ హౌస్ కు అది కరెక్ట్ కాదని బాలాదిత్య చెప్పాడు. చిత్రం ఏమంటే… ఎప్పుడూ లేని విధంగా ఈసారి బాలాదిత్యను ఏకంగా ఎనిమిది మంది (ఫైమా, శ్రీసత్య, గీతు, రాజశేఖర్, ఇనయా, అర్జున్, కీర్తి, ఆర్జే సూర్య) నామినేట్ చేశారు. దీంతో ఖంగు తిన్న అతను… ఇక్కడ అందరి గురించి తాను ఆలోచించానని, కానీ తాను హౌస్ నుండి వెళ్ళిపోవాలని ఇంతమంది కోరుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని బాధ పడ్డాడు.
బ్యాటరీని ఎక్కువ శాతం వాడుకున్నాడనే కారణంగా బాలాదిత్యను అత్యధికులు నామినేట్ చేయగా, కెప్టెన్ గా ఉండి కూడా పట్టపగలు నిద్రపోయాడనే రీజన్ తో రేవంత్ ను ఆరుగురు నామినేట్ చేశారు. ఇక గేమ్ లో భాగంగా రోహిత్ ఇప్పటికే సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. దాంతో ఈ వారం ఏకంగా పన్నెండు మంది నామినేషన్స్ లో ఉన్నారు. రోహిత్, బాలాదిత్య, రేవంత్, వాసంతి, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనయా, అర్జున్, కీర్తి భట్, శ్రీసత్య, మెరీనా, ఫైమాలలో ఎవరు బెటర్ గా ఆడి, వ్యూవర్స్ ను మెప్పించి, ఓట్లు పొందుతారో చూడాలి.