NTV Telugu Site icon

భలే భాగ్యరాజా!

k. bagyaraj

k. bagyaraj

పాత కథలకే కొత్త సొబగులు అద్ది సరికొత్తగా మలచి అలరించారు ఎందరో దర్శకులు. ఈ తరం దర్శకులు కూడా అదే తీరున సాగుతున్నారు. అలాంటి విన్యాసాలు ఏ నాడో చేసి ఆకట్టుకున్నారు దర్శకరచయిత, నటుడు భాగ్యరాజా. ఈ తరం వారికి దర్శకునిగా ఆయన పేరు అంతగా పరిచయం లేకపోవచ్చు. నవతరం ప్రేక్షకులలో కొంతమందికి ఆయన నటునిగా పరిచయం ఉన్నారు. చాలా రోజుల నుంచే భాగ్యరాజా నటనలో రాణిస్తున్నారు. ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా కనిపిస్తున్నారు. అయితే నటునిగా, కథకునిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా, దర్శకునిగా భాగ్యరాజా తన బహుముఖ ప్రజ్ఞను పలు మార్లు ప్రదర్శించారు.

భాగ్యరాజా 1953 జనవరి 7న తమిళనాడు ఈరోడ్ జిల్లా వెల్లన్ కోయిల్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి కృష్ణసామి భాగ్యరాజాను అన్నిటా ప్రోత్సహించేవారు. ఆటల్లో, పాటల్లో, చదువులో భాగ్యరాజా భలేగా రాణించేవారు. చిన్నతనంలో భాగ్యరాజాకు ఎమ్.జి.రామచంద్రన్ అంటే ప్రాణం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగారు. తరువాత హిందీ సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా సినిమాలు చూసి, సినిమా రంగంపై మోజు పెంచుకున్నారు. నాటకాలు రాయడంలో మేటి అనిపించుకున్న భాగ్యరాజా, సినిమా రంగంలో ఇట్టే ఒదిగిపోయారు. దర్శకుడు భారతీరాజా దగ్గర చేరి, తన స్క్రిప్ట్ తో ఆకట్టుకున్నారు.

ఒకప్పుడు దర్శకుడు భారతీరాజా పేరు తమిళనాట మారుమోగింది. ఆయన దర్శకత్వంలో పల్లె పచ్చదనంతో పాటు జానపద కళలూ కనిపించేవి. తన గురువు ఎప్పుడూ పల్లె కథలనే తెరకెక్కిస్తున్నారని ఓ పట్నం కథతో సినిమా తీయాలని సూచించారు భాగ్యరాజా. ప్రతిభకు పట్టం కట్టే ఆ గురువు శిష్యుని మాటను మన్నించి ‘సిగప్పు రోజాక్కల్’ తెరకెక్కించాడు. శిష్యుడు భాగ్యరాజా ఆ సినిమాకు మాటలు రాశారు. ఆ రోజుల్లో తమిళనాట ఆ మాటలు భలేగా పేలాయి. గురువు రూపొందించే చిత్రాలలో భాగ్యరాజా బిట్ రోల్స్ వేశారు. కొందరు వేరే దర్శకులు కూడా భాగ్యరాజాలోని నటుణ్ణి ప్రోత్సహించారు. తానే హీరోగా రాణించాలని భావించిన భాగ్యరాజా ‘సువరిల్లద చిత్తిరంగల్’తో తన అభిలాష తీర్చుకున్నారు. స్వీయ దర్శకత్వంలో భాగ్యరాజా కథానాయకునిగా నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ‘ఒరు కై ఊసై’తో భాగ్యరాజా నిర్మాతగానూ మారారు. ఈ సినిమా సాధించిన విజయంతో మళ్ళీ ఆయన తిరిగి చూసుకోలేదు. తరువాత “మౌన గీతంగల్, ఇండ్రు పోయి నాలై వా, విదియుమ్ వరై కాదిరు, అంద ఏళు నాట్కల్, డార్లింగ్ డార్లింగ్” వంటి చిత్రాలు భాగ్యరాజా హీరోగా రూపొంది ఎంతగానో జనాన్ని ఆకట్టుకున్నాయి.

భాగ్యరాజా పాతకథలను తీసుకొని, వాటిని నవతరం ప్రేక్షకులకు ఎలా చెబితే బాగుంటుందో ఆలోచించేవారు. ఆయన కథలతో తెరకెక్కిన చిత్రాలన్నీ దాదాపుగా అలాంటివే. యన్టీఆర్ ‘రాము’ చిత్రానికి మాతృక హిందీ ‘దూర్ గగన్ కీ చాహో…మే’. ఈ చిత్రంలో మూగవాడైన కొడుకుతో హీరో ఓ ఊరికి వచ్చి అక్కడే ఉండాల్సి వస్తుంది. ఆ ఊరిలో కలవారి అమ్మాయి చివరకు అతణ్ణి వరిస్తుంది. అదే తీరున ‘ముందానై ముడిచ్చు’ చిత్రాన్ని తెరకెక్కించాడు భాగ్యరాజా. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. అదే చిత్రాన్ని తెలుగులో జంధ్యాల ‘మూడుముళ్ళు ‘ పేరుతో తీశారు. భాగ్యరాజా ‘ముందానై ముడిచ్చు’ను తరువాత ‘వద్దంటే పెళ్ళి’ పేరుతో తెలుగులో అనువదిస్తే, ఇక్కడా మంచి ఆదరణ పొందింది. ఇదే కథను కె.రాఘవేంద్రరావు హిందీలో రాజేశ్ ఖన్నాతో ‘మాస్టర్ జీ’గా రూపొందించారు.
భాగ్యరాజా ‘ఇదు నమ్మ ఆలు’ చిత్రం కూడా పాత శివాజీ గణేశన్ మూవీకి కాసిన్ని మార్పులూ చేర్పులూ చేసి తీశారు. ఇదే చిత్రం తెలుగులో ‘నేనూ మీ వాడినే’ పేరుతో అనువాదమై ఆకట్టుకుంది. ఈ చిత్రకథతో 1996లో ఇ.వి.వి. సత్యనారాయణ ‘అదిరింది అల్లుడు’ తీశారు. ఇక ఏయన్నార్ ‘అర్ధాంగి’ కథను పోలినట్టుగానే ‘ఎంగ చిన్న రాసా’ చిత్రం రూపొందించారు రాజా. ఇదే చిత్రం తెలుగులో ‘చిన్న రాజా’గా విడుదలై విజయం సాధించింది. కొన్నేళ్ళ తరువాత ఇదే కథతో హిందీలో అనిల్ కపూర్ ‘బేటా’ రూపొంది ఘనవిజయం సొంతం చేసుకుంది. దానిని మళ్ళీ వెంకటేశ్ తో ఇ.వి.వి. ‘అబ్బాయిగారు’ అని తెరకెక్కించి సక్సెస్ సాధించారు. ఇలా చెప్పుకుంటూ పోతే భాగ్యరాజా కెరీర్ లో పలు పాత కథలకు కొత్త నగిషీలు అద్దిన వైనం కనిపిస్తుంది.

భాగ్యరాజ్ తనతో కలసి పనిచేసిన ప్రవీణ అనే నటిని పెళ్ళాడారు. ఆమె అకాలమరణం తరువాత నటి పూర్ణిమా జయరామ్ ను పెళ్ళి చేసుకున్నారు. తెలుగులో బాపు ‘మంత్రిగారి వియ్యంకుడు’లో చిరంజీవి జోడీగా నటించింది పూర్ణిమా జయరామ్. భాగ్యరాజా, పూర్ణిమ కలసి నటించిన ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’ ఆ రోజుల్లో మంచి విజయం సాధించింది. భాగ్యరాజాకు ఇద్దరు పిల్లలు- శరణ్య, శంతను. భాగ్యరాజా తనయుడు శంతను భాగ్యరాజ్ నటునిగా రాణిస్తున్నాడు. భాగ్యరాజా ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో నటిస్తూనే ఉండడం విశేషం.

Show comments