కార్తికేయ… ‘ఆర్.ఎక్స్.100’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరో. దానికి ముందు ‘ప్రేమతో మీ కార్తీక్’ మూవీలో హీరోగా నటించినా, గుర్తింపు మాత్రం ‘ఆర్. ఎక్స్. 100’తోనే వచ్చింది. ఆ గ్రాండ్ సక్సెస్ కారణంగా కార్తికేయ గత మూడేళ్లుగా వెనుదిరిగి చూసుకోకుండా సినిమాలు చేస్తూ వచ్చాడు. అతనిలోని ఎనర్జీ లెవెల్స్ చూసి యూత్ ఫుల్ లవ్ స్టోరీలు తీయాలనుకున్న దర్శకులు, యాక్షన్ డ్రామాలు చేయాలనుకున్న నిర్మాతలు క్యూ కట్టారు. అలా వచ్చిన ‘హిప్పీ’, ‘గుణ 369′, ’90 ఎం.ఎల్.’ వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
Read Also : Kajal Aggarwal : రెండవ బిడ్డ ఆన్ ది వే… నిషా స్పెషల్ పోస్ట్
ఇదిలా ఉంటే, హీరోగా రాణించాలని భావించి సినిమా రంగంలోకి వచ్చిన కార్తికేయ ఓ మెట్టు దిగి నాని ‘గ్యాంగ్ లీడర్’లో విలన్ గా నటించాడు. నటుడిగా తనను ఆ సినిమా మరో స్థాయికి తీసుకెళుందని భావించాడు. కానీ దురదృష్టం… ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అంతే కాదు… ఆ తర్వాత గీతా ఆర్ట్స్ 2లో కార్తికేయ చేసిన ‘చావు కబురు చల్లగా’ డిజాస్టర్ గా నిలిచింది. దాని నుండి కాస్తంత కోలుకుని ఈ మధ్య చేసిన ‘రాజా విక్రమార్క’ మూవీదీ అదే పరిస్థితి. కార్తికేయ కథలను ఎంపిక చేసుకోవడంలో ఎక్కడో తప్పు జరుగుతోందని కొందరంటున్నారు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని విలన్ గా నటించడానికీ సిద్ధపడ్డ కార్తికేయకు లక్ కలిసి రావడం లేదని మరికొందరు అంటున్నారు. మొన్నటి ‘గ్యాంగ్ లీడర్’ మాత్రమే కాదు… అతని తాజా చిత్రం ‘వలిమై’ విషయంలోనూ అదే జరిగింది. గురువారం విడుదలైన ఈ సినిమాకు బ్యాడ్ రిపోర్టే వస్తోంది. కోలీవుడ్ స్టార్ అజిత్ మూవీలో విలన్ గా నటించే ఛాన్స్ దక్కడం అంటే మాటలు కాదు… దాన్ని కార్తికేయ సాకారం చేసుకున్నాడు. కానీ దానికి తగ్గట్టు సక్సెస్ కూడా వచ్చి ఉంటే కథ వేరేలా ఉండేది. బట్ బ్యాడ్ లక్… ఇంకా కార్తికేయకు కాలం కలిసి రాలేదనే అనుకోవాలి. ఒకటి మాత్రం నిజం… ‘వలిమై’ సినిమాతో కార్తికేయకు సౌత్ లో ఓ కొత్త ద్వారం తెరుచుకుంది. అతని నటన నచ్చిన ఒకరో ఇద్దరో తమిళ నిర్మాతలు అవకాశం ఇవ్వకపోరు. అప్పుడైనా సక్సెస్ వరిస్తే… కార్తికేయ ట్రాక్ లోకి వచ్చేసినట్టే!!