పాన్ ఇండియా యాక్ట్రస్ తమన్నా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఇప్పటి వరకూ పెద్దంత విజయం సాధించలేదు. అయినా ఆమె నటన మీద నమ్మకం ఉన్న దర్శక నిర్మాతలు ఆమెకు ఛాన్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్… తమన్నాతో ‘బబ్లీ బౌనర్స్’ మూవీని తెరకెక్కించాడు. పహిల్వాన్స్ ను తయారు చేసే అసోలా ఫతేపూర్ అనే పల్లెటూరి నుండి న్యూఢిల్లీకి వచ్చిన లేడీ పహిల్వాన్ బబ్లీ కథ ఇది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది.
ఈ సందర్బంగా మూవీ ట్రైలర్ ను సోమవారం విడుదల చేశారు. ఆద్యంతం వినోదాన్ని పండిస్తూ ఈ ట్రైలర్ సాగింది. పక్కా పల్లెటూరి అమ్మాయిగానే కాదు… లేడీ బౌనర్స్ గా తన కండబలాన్ని చూపించే ధీరోదాత్త వనితగానూ తమన్నా మేకోవర్ బాగుంది. సన్నివేశాలకు తగ్గట్టుగా సాగే సంభాషణలు నవ్వుల జల్లులు కురిపించడం ఖాయమనిపిస్తోంది. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ కు థియేటర్ల కంటే ఓటీటీనే బెటర్ అని నిర్మాతలు భావించినట్టున్నారు. అందుకే ఓటీటీ రిలీజ్ కే ఫిక్స్ అయిపోయారు. ఇందులో సౌరభ్ శుక్లా, అభిషేక్ బజాజ్, సాహిల్ వైద్ కీలక పాత్రలు పోషించారు. కరన్ మల్హోత్రా, తనిష్క్ బాగ్చీ సంగీతాన్ని అందించారు. మరి తమన్నా నటించిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘బబ్లీ బౌనర్స్’కు ఓటీటీ వ్యూవర్స్ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. విశేషం ఏమంటే… ఇదే నెల 23న సత్యదేవ్ సరసన తమన్నా నటించిన ‘గుర్తుందా శీతాకాలం’మూవీ కూడా విడుదల కానుంది. అనువాద చిత్రం ‘బబ్లీ బౌన్సర్’ ఓటీటీలో వస్తుంటే… ‘గుర్తుందా శీతాకాలం’ థియేటర్లలో విడుదల కానుంది.