Famous Actor Anupam Kher In Sankalp Reddy Movie.
ప్రస్తుతం భారతీయ చిత్రసీమ మాత్రమే కాదు… అన్ని పొలిటికల్ పార్టీలూ మాట్లాడుకుంటున్న సినిమా ఒక్కటే… ‘ద కశ్మీర్ ఫైల్స్’. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సినిమాను చూసి వినోదపు పన్ను రాయితీ ఇస్తే, ఆ పార్టీని వ్యతిరేకించే తెలంగాణ సీఎం కేసీఆర్ వంటి వారు ‘ద కశ్మీర్ ఫైల్స్’ సమాజంలో రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే చిత్రమని అభివర్ణిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నాలుగు వందల థియేటర్లలో పది రోజుల క్రితం విడుదలైన ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమా ఇవాళ నాలుగు వేల థియేటర్లలో ప్రదర్శితమౌతోంది. వరల్డ్ వైడ్ రూ. 200 కోట్ల గ్రాస్ మైలురాయిని చేరుకుంటోంది. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో కశ్మీర్ పండిట్ గా కీలక పాత్ర పోషించిన అనుపమ్ ఖేర్ నూ ప్రేక్షకులు విశేషంగా అభినందనలతో ముంచెత్తుతున్నారు.
తాజాగా అనుపమ్ ఖేర్ తన 523వ చిత్రానికి సంబంధించిన ప్రకటన చేశారు. తెలుగువాడైన సంకల్ప్ రెడ్డి తన తొలి చిత్రం ‘ఘాజీ’తో జాతీయ అవార్డును అందుకున్నాడు. ఆ సినిమా తెలుగుతో పాటు హిందీలోనూ రూపుదిద్దుకుని చక్కని విజయాన్ని సాధించింది. ఆ తర్వాత సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ‘అంతరిక్షం’ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాను హిందీలో చేస్తున్నాడు సంకల్ప్ రెడ్డి. విశేషం ఏమంటే ఈ సినిమాతో నటుడు విద్యుత్ జమ్వాల్ నిర్మాతగా మారాడు. యాక్షన్ హీరో ఫిలిమ్స్ బ్యానర్ పై రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి విద్యుత్ జమ్వాల్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. 1971 ఇండో-పాక్ వార్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీకి ‘ఐబీ -71’ అనే పేరు పెట్టారు. ఇందులో ఇంటెలిజెన్స్ అధికారిగా విద్యుల్ జమ్వాల్ నటిస్తున్నాడు. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కాగా, తాజా షెడ్యూల్ లో అనుపమ్ ఖేర్ జాయిన్ అయ్యారు. ‘ప్రతిభావంతుడైన విద్యుల్ జమ్వాల్ తో కలిసి ‘ఐబీ -71’లో నటించడం ఆనందంగా ఉంద’ని, తన గెటప్ ను రివీల్ చేస్తూ అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మరి ‘ద కశ్మీర్ ఫైల్స్’ తర్వాత అనుపమ్ ఖేర్ నటిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.