తెలుగు చిత్రసీమలో స్క్రీన్ ప్లే రాయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు ప్రముఖ దర్శకనిర్మాత కె.యస్.ప్రకాశరావు. ఆయన దర్శకత్వంలో రూపొందిన అనేక తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. హిందీ చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించారు. కె.యస్.ప్రకాశరావుతో మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు అనుబంధం ప్రత్యేకమైనది. వారిద్దరి కాంబినేషన్ లో “కన్నతల్లి, బందిపోటు దొంగలు, ప్రేమనగర్, సెక్రటరీ” వంటి చిత్రాలు తెరకెక్కాయి. ఏయన్నార్ తో కె.యస్.ప్రకాశరావు రూపొందించిన తొలి చిత్రం ‘కన్నతల్లి’ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మితమయింది. తమిళంలో ‘పెట్రతాయి’ పేరుతో రూపొందింది. అందులోనూ ఏయన్నార్ నటించారు. ఈ చిత్రంలో తల్లిపాత్రను కె.యస్.ప్రకాశరావు భార్య జి.వరలక్ష్మి ధరించారు. 1953 ఏప్రిల్ 16న విడుదలైన ‘కన్నతల్లి’ మంచి ఆదరణ పొందింది.
ఇంతకూ ‘కన్నతల్లి’ కథ ఏమిటంటే – చలపతి, శాంతమ్మ తమ ఇద్దరు కొడుకులు రాము, శంకర్ తో ఆనందంగా జీవిస్తూంటారు. వ్యసనాలకు బానిస అయిన చలపతి విలాసంగా తిరుగుతూ అప్పుల పాలయి, పరారవుతాడు. శాంతమ్మ తన ఒద్దరు కొడుకులను రెక్కల కష్టంతో పెంచిపెద్ద చేస్తుంది. రాము భార్య లక్ష్మి గయ్యాళి. అత్తనే రాచి రంపాన పెడుతుంది. ఇక శంకర్ తన మేనమామ కూతురు గౌరిని ప్రేమిస్తాడు. తమ్మునికి పెళ్ళి చేయాలని రాము పట్నం వెళ్ళి కాలేజ్ లో చదువుతున్న శంకర్ ను కలవాలనుకుంటాడు. అయితే అక్కడ శంకర్ వ్యసనలోలుడై డబ్బులు తగలేస్తున్నాడని తెలుస్తుంది. రామును శంకర్ అవమానిస్తాడు. దాంతో వాడు తమ్ముడు కాదు, నేను వాడికి అన్ననూ కాదని అంటాడు రాము. అందుకు అతని గయ్యాళి భార్య మరింత ఆజ్యం పోస్తుంది. ఇకపై శంకర్ కు ఒక్కపైసా కూడా పంపవద్దని అంటాడు రాము. శాంతమ్మ తన వద్దనున్న డబ్బును మనీఆర్డర్ చేసి, అందులోనే త్వరగా రమ్మని శంకర్ కు కబురు పంపుతుంది. అతను చంచల అనే వగలాడి వలలో చిక్కి డబ్బు తగలేస్తుంటాడు. అతను తల్లి ఉత్తరం చూసి కూడా రాడు. చెడిపోయిన వాడికి తన కూతురును ఇవ్వనని అంటాడు మేనమామ. దాంతో శంకర్ ను ప్రేమించిన ఆయన కూతురు గౌరి ఆత్మహత్యాయత్నం చేస్తుంది. ఆమెను శాంతమ్మ రక్షిస్తుంది. ఎలాగైనా శంకర్ ను తీసుకు వస్తానని చెప్పి,పట్నం వెళ్తుంది. అక్కడ చంచల నిజస్వరూపం తెలుసుకున్న శంకర్ ఆవేశంతో ఆమెను హత్య చేసి పారిపోతాడు. అదే సమయానికి అక్కడకు వెళ్ళిన శాంతమ్మ కొడుకును రక్షించడానికి, ఆ నేరం తనపై వేసుకుంటుంది. శాంతమ్మను పోలీసులు అరెస్ట్ చేస్తారు. తల్లిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేసి తీసుకు వెళ్తున్నారో రాముకు అర్థం కాదు. అతనికి శంకర్ తారసపడతాడు. విషయం అర్థమవుతుంది. తాను చేసిన నేరానికి అమ్మ శిక్ష అనుభవించడం సరికాదని, చేసిన నేరం ఒప్పుకుంటానని శంకర్ అంటాడు. చిత్రంగా శాంతమ్మ పక్క సెల్ లోనే ఆమె భర్త చలపతి బైరాగిలాగా కనిపిస్తాడు. అతనికి కొడుకులు పెద్దవారయ్యారని, పెద్దవాడికి పెళ్ళయిందని, చిన్నవాడికి పెళ్ళి కావలసి ఉందని చెబుతుంది. కొడుకులను పెంచి పెద్ద చేసినందుకు భార్యకు నమస్కరిస్తాడు చలపతి. అదే సమయానికి శాంతమ్మను చూడటానికి వస్తారు రాము, శంకర్. చిన్నకొడుకులో మార్పు చూసిన శాంతమ్మ, నూరేళ్ళు హాయిగా ఉండమని కొడుకులకు చెబుతుంది. కన్నకొడుకుల కోసం తల్లి ఈ మాత్రం చేయకూడదా అనీ శంకర్ కు చెబుతుంది. రాము, తమ్ముడిని క్షమిస్తాడు. ఏ రోజునైనా నాన్న వచ్చి అమ్మ ఏదని అడిగితే ఏం చెప్పాలని అంటాడు రాము. కానీ, అతనికి తెలియదు పక్క సెల్ లోనే ఉన్న వ్యక్తి తన తండ్రి అని. మరుసటి రోజున శాంతమ్మకు శిక్ష అమలవుతుందని తెలిసి చూడటానికి రాము, అతని భార్య, శంకర్, గౌరి అందరూ వస్తారు. వారికి అభివాదం చేస్తూ శిక్ష అనుభవించడానికి శాంతమ్మ వెళ్తూ ఉండగా, చిత్రం ముగుస్తుంది.
ఈ చిత్రంలో శాంతమ్మగా జి.వరలక్ష్మి, ఆమె భర్త చలపతిగా ఆర్.నాగేశ్వరరావు, రాముగా ఏయన్నార్, శంకర్ గా నంబియార్ నటించారు. పేకేటి శివరామ్, రమణారెడ్డి, పెండ్యాల నాగేశ్వరరావు, మిక్కిలినేని, మోహిని, టి.డి.వసంత, సి.వరలక్ష్మి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి పెండ్యాల సంగీతం సమకూర్చగా, శ్రీశ్రీ, ఆరుద్ర, సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి, తాపీ ధర్మారావు పాటలు పలికించారు. ఇందులోని “శ్రీరామ రామనుదును…”అంటూ సాగే బుర్రకథను శ్రీశ్రీ, ఆరుద్ర రాశారు. “స్వతంత్రభానుడు…”, “సారములేని సంసారం…”, “చూస్తారెందుకూ రారండి…”, “ఎందుకు పిలిచావెందుకు…”, “చూచావా చూచావా…”, “ఇదే ఇదే విలాసము…”, “నువ్వు కావాలి…”, “ఎంత మంచిదానవోయమ్మా…” అంటూ సాగే పాటలు అలరించాయి.
ఈ చిత్రంలో సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు పెరుమాళ్ళు అనే పాత్రను కూడా ధరించడం విశేషం! అంతకు ముందు ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడుతున్న పి.సుశీలను ఈ సినిమాతోనే పెండ్యాల చిత్రసీమకు పరిచయం చేశారు. ఈ సినిమాలోని “ఎందుకు పిలిచావెందుకూ..” అంటూ సాగే పాటను పి.సుశీల, ఘంటసాలతో కలసి గానం చేశారు. ఇదే పాటను తమిళ వర్షన్ ‘పెట్ర తాయి’లో ఏ.యమ్.రాజాతో కలసి పి.సుశీల పాడడం విశేషం. ఇలా ఒకే పాటను రెండు భాషల్లో ఇద్దరు మేటి గాయకులతో పాడుతూ పి.సుశీల చిత్రసీమలో ప్రవేశం చేయడం మరింత విశేషం!ఈ పాటను నంబియార్, టి.డి.వసంతపై చిత్రీకరించారు. ‘కన్నతల్లి’ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తరువాత కొడుకుల కోసం తల్లి త్యాగం చేసే కథలు మరికొన్ని వెలుగు చూశాయి