‘సంక్రాంతి’ పండగకు ఓ సినిమా రిలీజ్ చేయడం, హిట్ అందుకోవడం దర్శకుడు అనిల్ రావిపూడికి అలవాటుగా మారింది. ఇప్పటికే ఎన్నో సంక్రాంతి విజయాలు అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈసారి ‘మన శంకర వరప్రసాద్ గారు’తో వచ్చి మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. వరుసగా తొమ్మిది సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమవడం అనిల్ కెరీర్‌లో అరుదైన ఘనతగా నిలిచింది. టాలీవుడ్‌లో కల్ట్ కామెడీ అండ్ కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అనిల్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.
అనిల్ రావిపూడి కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన సినిమా ‘పటాస్’. 2015లో మొదలైన ఆయన విజయ పరంపర ఇప్పటివరకు ఆగలేదు. తొలి సినిమాతోనే కమర్షియల్ సక్సెస్ అందుకున్న అనిల్.. ఆ తర్వాత తెరకెక్కించిన ప్రతి చిత్రం ప్రేక్షకులను అలరించడంలో విజయవంతమయ్యింది. ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’ వంటి సినిమాలతో ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొత్త అర్థం చెప్పిన అనిల్.. ‘F2’తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించారు. ఆ తర్వాత వచ్చిన ‘సరి లేరు నీకెవ్వరు’ సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేయగా.. ‘F3’ డీసెంట్ హిట్ అందుకుంది.
Also Read: T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు.. ఐసీసీకి పీసీబీ స్పెషల్ ఆఫర్!
ఇక ‘భగవంత్ కేసరి’ సినిమాతో సందేశంతో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను అందించిన అనిల్ రావిపూడి మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. గతేడాది విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈ చిత్రం అనిల్ సంక్రాంతి సెంటిమెంట్‌ను మరింత బలపరిచింది. ఇప్పుడు ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో మరో హిట్ అందుకున్నారు. వరుసగా తొమ్మిదో విజయాన్ని ఖాతాలో వేసుకున్న అనిల్.. సంక్రాంతి మొనగాడిగా నిలిచారు. ఎంటర్‌టైన్‌మెంట్, హాస్యం, ఎమోషన్‌లను సమపాళ్లలో మేళవిస్తూ ప్రేక్షకులను మెప్పించడమే అనిల్ సక్సెస్ మంత్ర అని చెప్పాలి. భవిష్యత్తులోనూ అనిల్ ఇలానే అలరించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
