Anchor Suma: మాట్లాడాలంటే వణికిపోతున్నారా? ఆ భయాన్ని పోగొట్టడానికి సుమ కొత్త అవతారం

Suma

Suma

తెలుగు బుల్లితెరపై తన మాటల గారడీతో దశాబ్దాలుగా ప్రేక్షకులను కట్టిపడేస్తున్న స్టార్ యాంకర్ సుమ కనకాల ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తారు. ఇప్పటివరకు నటిగా, యాంకర్‌గా, నిర్మాతగా తన సత్తా చాటిన ఆమె, ఇకపై ఒక ‘కోచ్’గా, ‘ట్రైనర్’గా మారబోతున్నారు. స్టేజ్ ఎక్కాలంటే వణుకు పుట్టేవారికి, నలుగురిలో ధైర్యంగా మాట్లాడలేక ఇబ్బంది పడేవారికి అండగా నిలిచేందుకు ‘Unmute with Suma – ధైర్యంగా మాట్లాడండి’ పేరుతో ఒక ప్రత్యేకమైన కోచింగ్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సుమ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ వర్క్‌షాప్‌ను ఏ భాషలో నిర్వహించాలనే దానిపై మొదట కాస్త తర్జనభర్జన జరిగిందని సుమ తెలిపారు. అయితే, తనకు ఇంతటి గుర్తింపును, జీవితాన్ని ఇచ్చింది తెలుగు భాషే కాబట్టి, ఈ ప్రయాణాన్ని తెలుగులోనే మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. స్కిల్ స్టూడియో ప్రో ఆధ్వర్యంలో జనవరి 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక రోజు వర్క్‌షాప్‌గా ఈ కార్యక్రమం జరగనుంది. 18 సంవత్సరాలు దాటిన వారందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు.

చాలామంది తనను కలిసినప్పుడు “మీరు అంత ధైర్యంగా, స్పాంటేనియస్‌గా ఎలా మాట్లాడతారు?” అని అడుగుతుంటారని సుమ గుర్తుచేసుకున్నారు. దాని వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెడుతూ.. “మనం ముందుగా అవతలి వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినాలి. ఎప్పుడైతే సరిగ్గా వినగలుగుతామో, అప్పుడే సమయస్ఫూర్తితో స్పందించగలం” అని తెలిపారు. కేవలం నోటికొచ్చింది మాట్లాడటం కాకుండా, మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటివారు వినాలనిపించేలా ఉండాలని, అందుకోసమే తన అనుభవాలన్నింటినీ డీకోడ్ చేసి ప్రత్యేక సిలబస్‌ను రూపొందించానని చెప్పారు. రాజకీయాలు, వ్యాపారం, యాంకరింగ్ ఇలా ఏ రంగంలో ఉన్నవారికైనా ఈ పబ్లిక్ స్పీకింగ్, సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ స్కిల్స్ ఎంతో అవసరమని వివరించారు.

గతంలో 8 నుంచి 18 ఏళ్ల వయసు వారి కోసం ఆన్‌లైన్‌లో ఈ కోర్సును ప్రారంభించగా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి దాదాపు 300 మంది జాయిన్ అయ్యి అద్భుతమైన స్పందన అందించారని సుమ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనకు తెలుగును ఎంతో చక్కగా నేర్పించిన ప్రముఖ కార్టూనిస్ట్ బ్నింకి సుమ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. అయితే, దీనిపై బ్నిం స్పందించిన తీరు అక్కడున్న వారిని నవ్వుల్లో ముంచెత్తింది. “నేను సుమ గారికి మాటలు నేర్పించాననేది కేవలం పుకారు మాత్రమే. నిజానికి నేను ఆమెలా మాట్లాడలేను. అందుకే ఈ వర్క్‌షాప్‌లో నేనే జాయిన్ అవుతాను” అంటూ ఆయన చమత్కరించడం విశేషం.