ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతుంటారు. అయితే తాజాగా అను చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లు అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేయడమే కాకుండా.. ఆమెలోని సున్నితమైన కోణాన్ని ఆవిష్కరించాయి. గత కొంతకాలంగా తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని వెల్లడించారు. ఈ క్రమంలోనే మంగళవారం జరిగిన ఒక లైవ్ ప్రెస్ మీట్లో జూమ్ కాల్ ద్వారా పాల్గొనాల్సి వచ్చింది. ప్రెస్ మీట్లో పాల్గొన్న వారు చూపిన అపారమైన మద్దతును చూసి ఆమె ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా శివాజీ నటీమణుల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలపై అనసూయ స్పందించగా.. ఆమెపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె స్పందించారు.
ప్రెస్‌మీట్ సందర్భంగా తనకు ఎదురైన భావోద్వేగ క్షణాలపై అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు చేశారు. ‘నేను బాగానే ఉన్నాను. నా ఆరోగ్య పరిస్థితిపై అనవసర ఆందోళనలు వద్దు. ఒక మహిళగా నా అభిప్రాయాన్ని, స్వేచ్ఛను వ్యక్తపరచినందుకే ఇలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడం బాధాకరం. అయినా ఇలాంటి అనుభవాల నుంచే నేను మరింత బలాన్ని పొందుతున్నా. నా వెనుక నిలిచిన ఎంతోమంది ధైర్యవంతమైన మహిళల మద్దతు నాకు గొప్ప శక్తినిస్తోంది. వారి మద్దతు నన్ను మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపిస్తోంది’ అని అనసూయ భావోద్వేగం చెందారు.
Also Read: Nayanthara Remuneration: రూ.4 కోట్ల నుంచి 18 కోట్లకు.. ఆ ఒక్క హిట్ నయనతార కెరీర్‌నే మార్చేసింది!
‘మనమందరం మనుషులమే. భావోద్వేగాలు వ్యక్తపరచడం లేదా బలహీన క్షణాలు రావడం సహజమే. అలాంటి క్షణాల గురించి మాట్లాడడంపై నేను సిగ్గుపడను. అసలైన విషయం ఏమిటంటే.. ఎన్ని కష్టాలు వచ్చినా మళ్లీ లేచి నిలబడటమే నిజమైన బలం. కొంతమంది ఇతరుల బలహీనతలను ఆసరాగా చేసుకుని లాభపడాలని చూస్తారు. అది నా వ్యక్తిత్వాన్ని ఏమాత్రం ప్రభావితం చేయదు. ఎలక్ట్రానిక్ మీడియాలోని కొన్ని విభాగాలపై నాకు నమ్మకం తగ్గుతున్నా.. న్యాయ వ్యవస్థపై మాత్రం పూర్తి విశ్వాసం ఉంది. క్లిక్‌బైట్ కథనాలు, ఊహాగానాలకు దూరంగా ఉండాలి. నిజాన్ని, మానవత్వాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. నిన్నటి ప్రెస్ మీట్లో నేను భౌతికంగా లేకపోయినప్పటికీ.. నా తరపున నిలబడి మద్దతుగా మాట్లాడిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా కోసం మీరు మాట్లాడిన మాటలే నాకు దక్కిన నిజమైన విజయం. వృత్తిపరమైన ఎదుగుదల కంటే.. ఇలాంటి సంక్షోభ సమయాల్లో లభించే గౌరవం, తోడ్పాటు గొప్ప ఆస్తిగా భావిస్తున్నా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, వెలుగు నిండాలని కోరుకుంటున్నా’ అని అనసూయ సుదీర్ఘ పోస్టులు చేశారు.