ఇటీవల విడుదలైన ‘మోడరన్ లవ్ ముంబై’ విజయంతో జోరు మీదున్న ప్రైమ్ వీడియో, జూలై 8న ‘మోడరన్ లవ్ హైదరాబాద్’ ఒరిజినల్ సీరిస్ ను ప్రసారం చేయనుంది. ప్రముఖ నిర్మాత ఎలాహే హిప్టూలా, ఎస్.ఐ.సి. ప్రొడక్షన్స్ ఈ కొత్త తెలుగు అమెజాన్ ఒరిజినల్ సిరీస్‌ని నిర్మించారు. దీనికి షో రన్నర్‌గా నగేష్ కుకునూర్ వ్యవహరిస్తున్నారు. ఇందులోని ఆరు ఎపిసోడ్స్ ను నగేశ్ కుకునూర్, ఉదయ్ కుర్రాల, దేవికా బహుధనం, వెంకటేశ్ మహా రూపొందించారు. వీటిలో నగేశ్ కుకునూర్ రూపొందించిన మూడు ఎపిసోడ్స్ లో రేవతి, నిత్యామీనన్; ఆది పినిశెట్టి, రీతువర్మ; సుహాసిని మణిరత్నం, నరేశ్ అగస్త్య నటించారు. ఉదయ్ గుర్రాల దర్శకత్వం వహించిన ఎపిసోడ్ లో అభిజిత్ దుద్దాల, మాళవిక నాయర్ నటించారు. దేవికా బహుధనం డైరెక్ట్ చేసిన ఎపిసోడ్ లో ఉల్కా గుప్తా, నరేశ్ నటించారు. ఇక వెంకటేశ్ మహా దర్శకత్వం వహించిన ఎపిసోడ్ లో కోమలి ప్రసాద్ నటించింది.
‘ప్రైమ్ వీడియోలో ‘మోడరన్ లవ్ ముంబై’ విజయం సాధించిన తర్వాత, మంచి ప్రశంసలు పొందిన అంతర్జాతీయ ఫ్రాంచైజీ ‘మోడరన్ లవ్’ యొక్క రెండవ భారతీయ ఎడిషన్‌ను తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంద’ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజినల్స్ హెడ్ అపర్ణ పురోహిత్ అన్నారు. “హైదరాబాద్ నేపథ్యంలోని ఈ కథలు మునుపెన్నడూ లేని విధంగా సంస్కృతి, చరిత్రలను అన్వేషిస్తాయి. ఈ కథలు మిమ్మల్ని నవ్వించేలా, ఏడ్పించేలా చేస్తాయి” అని అపర్ణ తెలిపారు. ‘ఈ ఆధునిక ప్రేమ కథలలో హైదరాబాద్ నగరం యొక్క నిజమైన సాంస్కృతిక సారాంశం, సామాజిక అంశాలు కనిపించేలా కృషి చేశామన్నారు షో రన్నర్ మరియు దర్శకులలో ఒకరైన నగేష్ కుకునూర్. ‘ఈ కథలన్నింటికి ప్రత్యేకంగా హైదరాబాదీ రుచిని ఎలివేట్ చేసే ఎపిసోడ్‌ల కోసం ఒరిజినల్ ట్రాక్‌లను రూపొందించిన కొంతమంది అద్భుతమైన సంగీత దర్శకులతో పనిచేశామని, మానవ భావోద్వేగాలతో నిండిన ఈ కథల్లోని ప్రతి నిమిషాన్ని ప్రేక్షకులు ఆస్వాదిస్తార’ని తాను నమ్ముతున్నట్టు నిర్మాత ఎలాహే హిప్టూలా తెలిపారు.