తాను చేయలేనిది ఏమీ లేదని సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి నిరూపించుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’లో తన మొట్టమొదటి ప్రత్యేక డ్యాన్స్ నంబర్ “ఊ అంటావా ఉఊ అంటావా” చేసింది. ఈ సాంగ్ ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణను అందుకుంటుంది. “ఊ అంటావా” సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ టాప్ 100 మ్యూజిక్ వీడియోలలో మొదటి స్థానంలో ఉండడం విశేషం. ఇటీవల జరిగిన ‘పుష్ప’ పార్టీలో అల్లు అర్జున్ తనపై నమ్మకం ఉంచి, ఎన్ని సందేహాలు ఉన్నా పాటను చేసినందుకు సమంతకు ధన్యవాదాలు తెలిపారు.
‘ఊ అంటావా’ బ్లాక్‌బస్టర్ సాంగ్‌ను ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడుతూ “సమంత గారూ ఈ పాట చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ సాంగ్ ను మీరెంత నమ్మారో తెలియదు కానీ… మా మీద నమ్మకంతో చేశారు చూడు… ఆ నమ్మకాన్ని థాంక్స్. ఎందుకంటే సెట్స్‌లో మీకు ఇది సరియైనదా కాదా ? అని మీకు ఎన్ని సందేహాలు ఉన్నాయో నాకు తెలుసు. కానీ నేను నన్ను నమ్మండి, చేయండి అని చెప్పాక మీరు నన్ను ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. నన్ను నమ్మి మీరు నా హృదయాన్ని, గౌరవాన్ని గెలుచుకున్నారు. అలాగే యూట్యూబ్‌లో ఈ పాట నంబర్ వన్‌గా నిలిచినందుకు మీకు అభినందనలు. ఇది మామూలు విషయం కాదు. ‘ఊ అంటావా ఉఊ అంటావా’ అంటే వేరే ఆప్షన్ లేకుండా అందరూ చచ్చినట్టు ‘ఊ’ అనాల్సిందే. ఈ పాట అందరికీ నచ్చే రేంజ్లో ఉంది” అని అన్నారు.
తనను అభినందిస్తూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలకు సమంత సమాధానమిస్తూ “నేను మిమ్మల్ని ఎప్పుడూ నమ్ముతాను” అంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ రిప్లై ఆమె మరో స్పెషల్ సాంగ్ కోసం సిద్ధమవుతుందేమో అనే క్యూరియాసిటీని పెంచింది.