సినిమా కథలు ఒక హీరో నుంచి మరో హీరోకి షిఫ్ట్ అవ్వడాన్ని మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు విడుదలకు ముస్తాబవుతున్న ‘ద వారియర్’ సినిమా కూడా ఆ జాబితాకు చెందినదే! లింగుసామి దర్శకత్వంలో రూపొందిన ఈ బైలింగ్వల్ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ రామ్ పోతినేని కాదని తాజాగా తేలింది. రామ్ కంటే ముందు ఈ సినిమా స్టోరీ ఓ స్టార్ హీరో వద్దకు వెళ్లింది. ఇంతకీ అతనెవరా? అని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
తాను లింగుసామి డైరెక్షన్‌లో ఓ బైలింగ్వల్ సినిమా చేస్తున్నానని 2016లోనే బన్నీ ప్రకటించాడు. అప్పట్లో ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కార్యక్రమాన్ని తమిళనాడులో గ్రాండ్‌గా నిర్వహించారు కూడా! అయితే, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఊసే రాలేదు. చూస్తుండగానే బన్నీ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఆ కథతోనే రామ్ ‘ద వారియర్’ చిత్రంగా తెరకెక్కించాడని తెరమీదకొచ్చింది. తన దగ్గరకి ఎన్నో పోలీస్ కథలొచ్చాయని, కాకపోతే ఈ కథ వినగానే తనకు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని రామ్ పలు ఇంటర్వ్యూలలో వెల్లడించాడు. మరి, బన్నీ ఎందుకు రిజెక్ట్ చేసినట్టు? ఇది ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది.
కాగా.. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాలో రామ్ సరసన కృతిశెట్టి కథానాయికగా నటించింది. ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. తమిళ దర్శకుడు, తెలుగు హీరో కావడంతో.. ఈ సినిమాపై అంచనాలు బాగానే నెలకొన్నాయి. మరి, అందుకు తగినట్టుగా ఇది ఆకట్టుకుంటుందా? లేదా? అన్నది ఈ నెల 14వ తేదీన తేలిపోనుంది.