సినీ ఇండస్ట్రీలో స్టార్‌డమ్ వస్తే చాలు, చుట్టూ ఉన్నవాళ్లు మారిపోతుంటారు. ఎదిగే కొద్దీ పాత పరిచయాలను పక్కన పెట్టేసే లోకమిది. కానీ, ఈ గ్లామర్ ప్రపంచంలోనూ తన స్నేహానికి అసలైన అర్థం చెబుతూ.. తాను ఎదగడమే కాకుండా తన చిన్ననాటి మిత్రులను కూడా అగ్రపీఠంపై కూర్చోబెడుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఫ్రెండ్ షిప్ డే సంధర్భంగా అల్లు అర్జున్ తన స్నేహితులను తనతో ముందుకు ఎలా తీసుకు వెళ్తున్నారు అనేది చూద్దాం. దర్శకధీరుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అట్రాక్టివ్ ప్రాజెక్ట్ ‘AA23’ ప్రకటన సమయంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే కేవలం సినిమా క్రేజ్ మాత్రమే కాకుండా, ఈ ప్రాజెక్ట్ వెనుక బన్నీ చూపించిన స్నేహ ధర్మం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు ఈ భారీ చిత్రానికి అల్లు అర్జున్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నలుగురు మిత్రులు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ జాబితాలో బన్నీ కెరీర్ ఆరంభం నుంచి వెన్నంటే ఉంటున్న బన్నీ వాస్‌తో పాటు, ఆయన స్కూల్ డేస్ ఫ్రెండ్స్ సందీప్ రామినేని, నటరాజ్ ఉన్నారు. వీరితో పాటు బన్నీ కజిన్, చిన్ననాటి స్నేహితురాలు స్వాతి కూడా ఈ ప్రొడక్షన్‌లో భాగమయ్యారు. ఇండస్ట్రీలో పాన్-ఇండియా రికార్డులు, కోట్ల టర్నోవర్లు రాకముందే ఏర్పడిన ఈ స్నేహబంధాన్ని బన్నీ ఇతరులకంటే భిన్నంగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇలా తన మిత్రులను నిర్మాణ రంగంలో భాగస్వామ్యం చేయడం బన్నీకి కొత్తేమీ కాదు. గతంలో ‘పుష్ప ది రైజ్’ సమయంలో తన మావయ్యకు చెందిన ముత్తంశెట్టి మీడియాను భాగస్వామిగా చేయడం, ఎస్కేఎన్, శరత్ వంటి మిత్రులను సక్సెస్‌ఫుల్ నిర్మాతలుగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. కేవలం తాను ఒక్కడే శిఖరాగ్రానికి చేరాలని చూడకుండా, తనతో పాటు నడిచిన వాళ్లను కూడా గెలిపించాలనే గొప్ప మనస్తత్వం అల్లు అర్జున్ సొంతం. తెలుగు తెరపై బ్లాక్‌బస్టర్ సినిమాలు, రికార్డులు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి. కానీ కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన స్నేహాన్ని ఎప్పటికీ మరిచిపోకుండా, కెరీర్‌లోనూ వాళ్లకు పెద్ద పీట వేస్తున్న బన్నీ తీరు అభినందనీయం.

