మెగాఫోన్ పట్టి తండ్రి ఇ.వి.వి. సత్యనారాయణ బాటలో దర్శకుడు కావాలనుకున్నాడు. కానీ, అనుకోకుండా అభినయంవైపు అడుగులు వేయవలసి వచ్చింది. ఆరంభ చిత్రం ‘అల్లరి’తోనే ‘అల్లరోడు’గా జనం మదిలో నిలచిపోయాడు నరేశ్. నవతరం నటుల్లో అతి తక్కువ సమయంలో యాభై చిత్రాలు పూర్తి చేసి రికార్డ్ సృష్టించాడు ఈ అల్లరోడు. కేవలం కామెడీతో కదం తొక్కడంలోనే కాదు వీలు దొరికితే అభినయంతోనూ అలరిస్తానని పలుమార్లు నిరూపించుకున్నాడు నరేశ్.
దర్శకనిర్మాత ఇ.వి.వి. సత్యనారాయణ చిన్నకొడుకుగా నరేశ్ 1982 జూన్ 30న జన్మించాడు. చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమ్ లో విద్యనభ్యసించిన నరేశ్ తండ్రి హైదరాబాద్ మకాం మార్చగానే ఆయన పనిచేసే చిత్రాలను అధ్యయనం చేయసాగాడు. అలాగే పాశ్చాత్య చిత్రాలను సైతం పరిశీలించి, దర్శకత్వంపై మక్కువ పెంచుకున్నాడు నరేశ్. అన్న రాజేశ్ ను తండ్రి ‘హాయ్’ సినిమాతో హీరోని చేశారు. తాను దర్శకుడినవుతానని చెప్పుకొనేవాడు నరేశ్. అదే సమయంలో ప్రముఖ నటుడు చలపతిరావు తనయుడు రవిబాబు మెగాఫోన్ పట్టి సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నాడు. తన సినిమాలో హీరోకి కావలసిన అన్ని లక్షణాలూ నరేశ్ లో ఉన్నాయని భావించిన రవిబాబు తన ‘అల్లరి’లో అతడినే హీరోగా ఎంచుకున్నాడు. తొలి సినిమానే మంచి విజయం సాధించడం, అప్పటికే ఓ నరేశ్ చిత్రసీమలో ఉండడంతో ఇతను ‘అల్లరి’ నరేశ్ గా నిలచిపోయాడు.
తెలుగు చిత్రాలలో నటిస్తూనే ‘కురుంబు’ అనే తమిళ సినిమాలోనూ నటించాడు నరేశ్. ‘నేను’ సినిమాతో నటునిగా మార్కులు సంపాదించాడు. తండ్రి దర్శకత్వంలో నరేశ్ నటించిన “కితకితలు, అత్తిలి సత్తిబాబు ఎల్.కె.జి.” చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఆ తరువాత కామెడీనే ఆయుధంగా చేసుకొని నరేశ్ సక్సెస్ రూటులో సాగిపోయాడు. “సీమశాస్త్రి, గమ్యం, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం, బ్లేడ్ బాబ్జీ, బెండు అప్పారావు ఆర్.ఎమ్.పి., నువ్వా నేనా, మడత కాజా”వంటి చిత్రాల్లో నరేశ్ అలరించాడు. ‘సుడిగాడు’లో ద్విపాత్రాభినయంతోనూ మురిపించాడు. తన 50వ చిత్రం ‘మామ మంచు – అల్లుడు కంచు’లో మోహన్ బాబుతో కలసి భలేగా వినోదం పండించాడు నరేశ్. మహేశ్ బాబు ‘మహర్షి’లో హీరో స్నేహితుడు రవిశంకర్ పాత్రలోనూ నరేశ్ భలేగా ఆకట్టుకున్నాడు. ‘నాంది’లో తన ఇమేజ్ కు భిన్నమైన పాత్రతోనూ అలరించాడు. ప్రస్తుతం అల్లరి నరేశ్ “సభకు నమస్కారం, ఇట్లు మారేడ్ మిల్లి ప్రజానీకం” చిత్రాల్లో నటిస్తున్నాడు. రాబోయే చిత్రాలతో నరేశ్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూద్దాం.