‘అన్నీ మంచి శకునములే’ అనే ఓల్డ్ సాంగ్ ను నేచురల్ స్టార్ నాని హ్యాపీగా హమ్ చేసుకోవచ్చు. ఈ మధ్య నాని సినిమాలు పెద్దంతగా బాక్సాఫీస్ దగ్గర హంగామా సృష్టించకపోయినా… అతని మీద తెలుగు ప్రేక్షకులకు ఉన్న ఆదరాభిమానాల్లో ఎలాంటి మార్పూ లేదు. అందుకు తాజాగా నిన్న విడుదలైన ‘అంటే సుందరానికీ…’ టీజర్ కు లభిస్తున్న ఆదరణను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ హవా ఇలా వీస్తుండగానే మరో రికార్డ్ ఒకటి నాని ఖాతాలో జమ అయ్యింది.
నాని, కీర్తి సురేశ్ జంటగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘నేను లోకల్’ మూవీ ఐదేళ్ళ క్రితం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. విశేషం ఏమంటే డిజిటల్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ లోనూ ఆ మూవీకి అలాంటి రెస్పాన్సే వచ్చింది. ఇటీవల ఈ సినిమా 100 మిలియన్ వ్యూస్ మైలురాయిని దాటేసింది. ఈ సినిమా విజయానికి డిఎస్పీ ఇచ్చిన సంగీతం కూడా హెల్ప్ అయ్యింది. ఏదేమైనా నానికి ఇక రాబోయేవన్నీ మంచి రోజులే అనిపిస్తోంది.